కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంతో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే కోవిడ్ నుంచి పూర్తి రక్షణ పొందొచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తొలి డోసు స్వీకరించి, రెండో డోసు తీసుకోని వారు 36.35 లక్షల మంది ఉన్నారని, వారంతా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా నమోదవుతుండడంతో కరోనా ఇక తగ్గిపోయిందన్న భావనతో 80 శాతం మంది మాస్కులు ధరించడం లేదని, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు కరోనా నిబంధనలను సమర్ధవంతంగా పాటించకపోతే కొత్త వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని శ్రీనివాసరావు హెచ్చరించారు. డెల్టా తగ్గినా, ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం కారణంతో కొత్త వేరియంట్ వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వేరియంట్లు వస్తే ప్రజలు, ప్రభుత్వం తట్టుకోవడం కష్టమని స్పష్టం చేశారు.