దేశంలో ఏడుకు చేరిన మంకీపాక్స్ కేసులు..

0
86

ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ టెర్రర్ పుట్టిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవ‌ల మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణించిన కేసులో త్రిసూర్ జిల్లాలో 20 మందిని క్వారెంటైన్ చేశారు.

తాజాగా కేర‌ళ‌లో మ‌రో మంకీపాక్స్ కేసు న‌మోదు అయింది. యూఏఈ నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ కేసుతో కేర‌ళ‌లో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్న‌ది. ఇక దేశ‌వ్యాప్తంగా ఆ వైర‌స్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవియా మంకీపాక్స్‌పై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ కొత్త వైరస్‌ ఏం కాదు. భారత్‌కు, ఈ ప్రపంచానికి అది కొత్తేం కాదు. దశాబ్దాల నుంచే ఆఫ్రికాలో ఉంది. కరోనా టైంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి, మంకీపాక్స్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదు.