మంకీపాక్స్ కలకలం..యూపీలో అల‌ర్ట్ జారీ

0
92

భారత్ లో మంకీపాక్స్ కలవరపెడుతుంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించగా..అందులో 3 కేసులు కేరళలోనే కావడం గమనార్హం. తాజగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మంకీపాక్స్ అల‌ర్ట్ జారీ చేశారు. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆస్ప‌త్రుల్లో మంకీపాక్స్ రోగుల కోసం మంచాల‌ను రిజ‌ర్వ్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా చేసిన పరిశోధనల ఆధారంగా మంకీపాక్స్ గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని అధికారులు తెలిపారు. ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌రగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, పెద్ద‌గా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

అనుమానిత లక్షణాలున్న పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువుల స్పర్శకు దూరంగా ఉండటం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలున్న వ్యక్తులకు దూరం పాటించడం, సభలు, జాతరలు, షాపింగ్‌ మాల్స్‌ వంటి హై రిస్క్‌ ప్రాంతాలలో మాస్క్‌ ధరించడం, రెగ్యులర్‌గా చేతుల పరిశుభ్రత పాటించడం, అనుమానిత లక్షణాలు కనబడ్డ వెంటనే తగిన వైద్యసలహా తీసుకోవడం, వ్యాధి లక్షణాలు తగ్గేదాకా ఐసోలేషన్‌ పాటించడం వంటివి చేయాలనీ అధికారులు సూచించారు.