తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు..ప్రజలకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అలర్ట్

Omicron cases in Telangana .. alert to the public

0
104

తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.

ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌ కేసుల వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌రావు మీడియాకు వివరించారు. 12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని..ఆమెకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు డా.శ్రీనివాస్‌రావు తెలిపారు.

హైదరాబాద్‌ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ కూడా సేకరించినట్లు తెలిపారు. కెన్యా మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకినట్లు డీహెచ్‌ వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పని లేదని.. కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అదొక్కటే మన ఆయుధమని ఆయన అన్నారు.