ఒమిక్రాన్ ఎఫెక్ట్..డబ్ల్యూహెచ్ఓ 7 హెచ్చరికలు జారీ?

Omicron Effect..WHO 7 Warnings Issued?

0
88

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. యూకే, యుఎస్ లోని ఓమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరమైనది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌తో పాటే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌కి సంబంధించి WHO ఏడు హెచ్చరికలను జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.

జెనీవాలో జరిగిన సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్‌ ఇంతకు ముందు ఏ వేరియంట్‌లో చూడని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు.

ఇన్ఫెక్షన్ సోకిన 24 గంటల తర్వాత డెల్టా, SARS-CoV-2 వైరస్ కంటే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా శరీరంలో వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నివేదించారు.

యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. డెల్టా వెర్షన్ కంటే ఓమిక్రాన్‌కు ఆసుపత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తుంది.

ఒమిక్రాన్ పై వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందం గొప్ప సమాచారాన్ని తెలిపింది. రష్యా గామ్లయా సెంటర్ నిర్వహించిన ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనం ఆధారంగా స్పుత్నిక్ లైట్ బూస్టర్ డోస్ ఈ వేరియంట్‌పై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.

మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఓమిక్రాన్ వేరియంట్‌ను తటస్థీకరించే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చని ప్రాథమిక డేటా సూచిస్తుంది.

ఒమిక్రాన్ పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులలో కూడా వ్యాప్తి చెందుతుందని WHO తెలిపింది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేరియంట్ మూడు రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ ద్వారా తెలిపింది.  ఈ క్రమంలో భద్రత దృష్ట్యా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులను కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలకు భారత ప్రభుత్వం ఆదేశించింది.

టీకాలు వేసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌కు రోగనిరోధక శక్తి పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి.