చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎంత ప్రయత్నించినా చిన్నపాటి చిలిపి రోగాలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలను ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ముల్లంగి(Radish) తినడం ద్వారా ఇటువంటి సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు. కేవలం ముల్లంగే కాకుండా దీని ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కానీ ముల్లంగి తినడం అంటే కొంతమంది అగ్నిపరీక్షలా ఫీల్ అవుతారు. అందుకు పచ్చి ముల్లంగి వాసనే కారణమని చెప్తారు.
ముల్లంగి రసం వాస చూస్తే కడుపులో దేవేస్తుందంటారు. మరకొందరు మాత్రం ముల్లంగి కర్రీ అంటే చాలు ఎగబడి తినేస్తారు. ఏది ఏమైనా ముల్లంగిని తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని, అందులోనూ చలికాలంలో అయితే ముల్లంగిని ఎలా తిన్నా ప్రయోజనాలు మాత్రం పుష్పలంగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఇంతకీ ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూసేద్దామా..
జీర్ణవ్యవస్థ: ముల్లంగిని తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. వీటిలో పుష్కలంగా ఉండే ఫైబర్.. మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది. దాంతో పాటుగానే మలబద్ధకం వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. దీని వల్ల పేగు ఆరోగ్యం పెరుగుతుంది.
బరువు నియంత్రణ: బరువు తగ్గాలని అనుకునే వారికి ముల్లంగి ఒక సూపర్ ఫుడ్ అని చెప్తున్నారు వైద్యులు. ముల్లంగిలో, ముల్లంగి ఆకులలో కూడా కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దాని వల్ల.. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అదే విధంగా కేలరీలు తక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా ఉత్పత్తి కాకుండా ఉండి బరువు నియంత్రణలో ముల్లంగి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇమ్యూనిటీ: ముల్లంగిలో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చలికాలంలో అధికంగా వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది.
యూరిక్ యాసిడ్: యూరిక్ యాసిడ్ నియంత్రణకు కూడా ముల్లంగి, ముల్లంగి ఆకులు బాగా పనిచేస్తాయి. శరీరంలో పెరిగే యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ముల్లంగి(Radish), ముల్లంగి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థరైటిస్ ఉన్న వారికి కూడా ఇవి చాలా బాగా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
రక్తపోటు: ముల్లంగి ఆకులు తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుందని వైద్యులు అంటున్నారు. అదే విధంగా ప్రస్తుతం పెరుగుతున్న రక్తహీనత సమస్యకు కూడా ముల్లంగి ఆకులు, ముల్లంగి దివ్యౌషధంలా పనిచేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా ముల్లంగి, ముల్లంగి ఆకులు.. మన గుండెను కూడా భద్రంగా ఉంచుతాయి. ఉన్న గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో అనేక రకాల గుండె సమస్యలు రాకుండా కూడా చేస్తాయని వైద్యులు చెప్తున్నమాట.
మెరిసే చర్మం: ముల్లంగిలో అధికంగా ఉండే విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి కూడా మేలు చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని పెంపొందించడంతో పాటు చర్మాన్ని మృధువుగా, మెరిసేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.