Salt Side Effects | జంక్ ఫుడ్ కారణంగానో, చిన్నప్పటి నుంచి అలవాటు వల్లో ప్రస్తుతం చాలా మంది రోజూ ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నారు. కానీ ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకునే వారికి స్టమక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్టమక్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు అధిక ఉప్పు తినడమే ప్రధాన కారణంగా ఓ పరిశోధనలో తేలిందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్యాన్సర్లతో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకు అధికమవుతుందని వివరిస్తున్నారు. కడుపు క్యాన్సర్ అనేది ఎక్కువ కాలం పాటు బాధపెడుతుంటే వారిలో క్లోమ గ్రంధి వంటి అవయవాలు కూడా ప్రభావితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో క్యాన్సర్ కణాలు పెరగడానికి కచ్ఛితమైన కారణం ఏంటో చెప్పలేనప్పటికీ.. ఉప్పు అధికంగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ కణాలు పెరిగే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
మితిమీరిన ఉప్పు తీసుకోవడం వల్ల కడుపులో చికాకుగా, అసౌకర్యంగా ఉంటుందని, ఇది క్యాన్సర్ కణాల ఉత్పత్తికి దోహదపడతాయని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆహారంలో సోడియం స్థాయిలు అధికమైతే కడుపులోని లైనింగ్ దెబ్బతింటుంది. అంతేకాకుండా కడుపులో దీర్ఘకాలిక మంటకు దారితీస్తుంది. ఇది కాస్త కాలక్రమేణా ముదిరి కడుపు క్యాన్సర్‌కు గురయ్యేలా చేస్తాయని పరిశోధన వివరిస్తోంది. కడుపులోని శ్లేష్మ పొరను ఉప్పు విచ్ఛిన్నం చేస్తోందని, ఉప్పులో ఉండే హెలికోబాక్టర్ పైలోరి ద్వారా ఇన్ఫెక్షన్ పెరగొచ్చని పరిశోధన వివరించింది. ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రిక్ అల్సర్‌లకు దారి తీస్తుంది, అదే కాలక్రమేణా క్యాన్సర్ గాయాలుగా అభివృద్ధి చెందుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించాలంటే ఆహారంలోకి తీసుకునే ఉప్పు శాతాన్ని కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ మోతాదులోనే ఉప్పును తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Salt Side Effects | ఒకవేళ స్టమక్ క్యాన్సర్ బారిన పడితే దాని నుంచి ఉపశమనం పొందడానికి, దానిని తగ్గించుకోవడానికి మన ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధ్యానాలు వంటి మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కూడా కడుపులో క్యాన్సర్‌ను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలని, లేనిపక్షంలో గ్యాస్ట్రిక్ సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. వీటితో పాటుగా శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవడం సులభమవుతుందని అంటున్నారు వైద్యులు.