SERPలో హెల్త్ ఇన్సూరెన్స్ ఆగిపోయి నెలరోజులు నడుస్తోందని వెంటనే ఆరోగ్యబీమా రెన్యువల్ చేయాలని SERP ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, ఏపురీ నరసయ్య , మహేందర్రెడ్డి శుభాష్ ఒక ప్రకటనలో కోరారు. నెలరోజులుగా ఆరోగ్య బీమా సేవలు లేకపోవడంతో సెర్ప్ సిబ్బంది ఆస్పత్రుల పాలైన వారు ఎలాంటి క్లెయిమ్ రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్నారని గత ఆనవాయితీ ప్రకారం వెంటనే ఈ గ్యాప్ పీరియడ్ లో సెర్ప్ నుంచే ఆస్పత్రి ఖర్చులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
సేర్ఫ్ శాఖకు ఫుల్ టైం సీఈఓని కేటాయించాలని, ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారికి SERP అదనపు బాధ్యతలు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్యలు విన్నవించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు. ఉన్నత స్థాయి అధికారి కావడంతో అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఆరోగ్య బీమా సహా పలు చిన్న చిన్న సమస్యలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పై SERPలో ఇదివరకే లెటర్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
SERP సంస్థ చైర్మన్ సీఎం కెసిఆర్, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోక్యం చేసుకుని వెంటనే SERP కు పూర్తి స్థాయి సీఈఓను నియమించడం సహా తక్షణమే ఆరోగ్య బీమా రెన్యువల్ చేసి, గత నెల రోజులుగా బీమా సౌకర్యం లేకపోవడంతో ఈ నెల రోజులకు సంబంధించిన ఆస్పత్రి ఖర్చులను గత ఆనవాయితీ ప్రకారం SERP నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు.