Skin care in winter with almond oil:చలి పంజా విసరటం మెుదలుపెట్టింది. మెున్నటి వరకు నామమాత్రంగా ఉండే చలి.. ఇప్పుడు గజగజ వణికిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ఉదయం పది దాటినా, సూర్య ప్రభావం తెలియటం లేదు.. మధ్యాహ్నాం మూడు దాటితేనే చలి ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కాలంలో చర్మాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ కాలంలో చర్మం పొడిబారటమే కాకుండా, నిర్జీవంగా మారుతుంది. ఇందుకోసం పలు మాయిశ్చరైజర్లను వాడటం సహజమే. కానీ, ఆయా మాయిశ్చరైజర్ల స్వభావం కారణంగా, చర్మానికి దుమ్ము సైతం అంటుకుంటూ ఉండటం వల్ల టాన్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ సమస్యను అధిగమిస్తూ, శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలా అని ఆలోచిస్తున్నారా.. దానికి పరిష్కారమే బాదం నూనె!.
బాదం నూనెలో విటమిన్ ఇ అధికంగా ఉండటంతో, అటు కేశ సంపదను సంరక్షించటంలో, చర్మాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆల్మండ్ ఆయిల్ చలికాలంలో చర్మానికి పోషణతో పాటు అందాన్ని సైతం అందిస్తుంది. మీరు డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతుంటే.. బాదం నూనెతో ప్రతి రోజూ కళ్లకింద మసాజ్ చేయండి. క్రమంగా డార్క్ సర్కిల్స్ కనుమరుగవుతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోవటం ద్వారా.. ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. చలికాలంలో వచ్చే ముడతలను తగ్గించటంలో ఆల్మండ్ ఆయిల్ ప్రభావం చూపుతుంది. (Skin care in winter)
మాయిశ్చరైజర్‌కు బదులుగా బాదం నూనెను మాయిశ్చరైజర్‌గా వాడుకోవచ్చు. చర్మం పగళ్లు, చికాకు, ఈ రోజుల్లో సహజమే.. వాటికి మంచి మందుగా బాదం నూనె పని చేస్తుంది. చలికాలంలో ఇబ్బంది పెట్టే మరొక సమస్య చుండ్రు. చుండ్రుకు చెక్ పెట్టడానికి బాదంనూనె సరైనదిగా చెప్పుకోవచ్చు. బాదం నూనెతో మాడుకు మాసాజ్ చేస్తున్నట్లు రాసుకోవటం ద్వారా, చుండ్రు బారి నుంచి తప్పించుకోవచ్చు. జుట్టు సైతం పట్టుకుచ్చులా మారి, స్మూత్‌గా తయారవుతుంది. మీరూ ఈ సమస్యలతో బాధపడుతుంటే.. ఒకసారి బాదం నూనెను ట్రై చేసి చూడండి.