తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ స్టాఫ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. శుక్రవారం స్టాఫ్ నర్సులు గాంధీభవన్ లో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మాట్లాడారు. ఏమాత్రం మానవత్వం లేకుండా రాత్రికి రాత్రి స్టాఫ్ నర్స్ లను టెర్మినేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ నీకు మానవత్వం ఉండదా నీవు మనిషివేనా అని నిలదీశారు. కరోనా ఆపద కాలంలో అహర్నిశలు కష్టపడి వేలాది మంది ప్రాణాలను కాపాడిన స్టాఫ్ నర్స్ ని నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించడం దుర్మార్గం అన్నారు. కరోనాతో ఒక్క హైదరాబాద్ లోనే ఒక నెలలో 30 వేల మరణాలు జరిగాయన్నారు.
సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడున్న నర్సులకు హామీలు ఇచ్చారు కదా అని ప్రశ్నించారు. టెర్మినేట్ చేసిన 1640 మంది నర్సులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్స్ తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. కెసిఆర్ ని కాపాడింది ఇదే నర్సులు అనే విషయం మరవరాదన్నారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తున్నారు ..కానీ స్టాఫ్ నర్స్ మాత్రం జీతాలు ఇవ్వరెందుకు అని ప్రశ్నించారు.