అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ 5 అంశాలు తెలుసుకోండి..

0
103

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధించే సమస్యల్లో ఒకటి అధిక బరువు. అధిక బరువుతో  ఎదుటివారు హేళన చేస్తారనో భయంతో నలుగురితో కలిసి తిరగడానికి ఇష్టపడడం లేదు. అయితే అధిక బరువుకు మానసికపరమైన 5 అంశాలు కారణం కావొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి..
ఒత్తిడికి గురైనప్పుడు తరచూ చిరుతిళ్లపై ఆసక్తి చూపిస్తారు. రోజులో ఆరేడుసార్లు ఆహారం తీసుకుంటారు. మనసును దారి మళ్లించడం కోసం ఇలా ప్రయత్నిస్తారు. దీంతో కొద్దికాలంలోనే, తెలియకుండా బరువు పెరుగుతారు.

అవసరానికి మించి..
ఆకలి తగ్గింది అనిపించినప్పుడు ఆహారాన్ని తీసుకోవడం ఆపెయ్యాలి. అవసరానికి మించి పళ్లెంలో ఉన్నవన్నీ అయ్యేవరకు ఏకబిగిన తింటే కెలోరీలు పెరుగుతాయి. ఉదయం అల్పాహారానికి దూరంగా ఉండి, మధ్యాహ్నం ఒకేసారి రెట్టింపు భోజనాన్ని తీసుకున్నా శరీరానికి నష్టమే.

బద్ధకం..
రోజూ వ్యాయామం చేయాలనుకున్నా, సమయం వీలుకాక లేదా బద్ధకించి అటువైపు అడుగులేయరు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే ఉద్యోగినులకు ప్రతి రోజూ ఉదయం కనీసం అరగంట వ్యాయామం మంచిది. ఇంటి పనులే కాకుండా నడవడానికి టైం కేటాయించుకోవాలి. వర్కవుట్లు తప్పనిసరి అని నిబంధన పెట్టుకోవాలి. కనీసం అరగంటసేపైనా నడకకు ప్రాధాన్యతనివ్వాలి.

ఆందోళనగా..
అనుకోనిది జరిగినప్పుడు మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. ఇది మానసికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదో ఆలోచిస్తూ, తినేటప్పుడు ఎంత తింటున్నారో గుర్తించక అధికంగా తీసుకుంటారు. క్రమంగా ఇది బరువును పెంచుతుంది. సమస్యను పరిష్కరించుకోవడానికి మనలోని నైపుణ్యాలను బయటకు తీయాలి.

వారంలో..
డైటింగ్‌ పేరుతో వారంలో నాలుగు రోజులు పూర్తిగా తినడం తగ్గించి, మిగతా మూడు రోజులు నచ్చిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రయోజనం ఉండదు. బరువు పెరగకూడదనే లక్ష్యాన్ని మరవకూడదు. ఆకలి అనిపించినప్పుడు కొవ్వుపదార్థాలను కాకుండా తాజా పండ్లు తీసుకుంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇవి శరీరంలో మలినాలను పోగొడతాయి.