వయసు పెరిగేకొద్ది శరీరంలో ఇతర భాగాలతో పాటు సాధారణంగా పొట్ట కూడా పెరుగుతుంది. ఇది ఇప్పుడు యువకులలో, యువతులతో ప్రధాన సమస్యగా మారింది. దీనితో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా 50 ఏళ్ల తర్వాత వచ్చే కొవ్వు సమస్యలు ఇప్పుడు 30 ఏళ్లకే వచ్చేస్తున్నాయి. అందంతో పాటు ఆరోగ్యానికి అనేక సవాళ్లు విసిరే ఈ సమస్యను చిన్నపాటి జాగ్రత్తలతో రాకుండా చూసుకోవచ్చు. పొట్ట పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం మరి..
నడుము చుట్టు కొవ్వు కారణంగా పొట్ట ఎక్కువవుతుంది. స్త్రీల విషయంలో ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. దీనివల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా చెడిపోతుంది. దీంతో మానసికంగా కుంగిపోతారు. గుండె జబ్బులు, మధుమేహానికి పొట్ట కారణమవుతుంది.
నిజానికి వయసు పెరిగే కొద్ది జీవక్రియలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. దీంతో కొవ్వు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిన స్త్రీలలో కలిగే హార్మోన్ల మార్పులు కూడా బరువుకు కారణమవుతాయి. కొంత మందిలో బరువు పెరగకుండా పొట్ట పెరుగుతుంది. ఇది మరింత ప్రమాదకరం.
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం పొట్టకు ప్రధాన కారణం. వేపిన కూరగాయల కన్నా ఆవిరి మీద ఉడికిన కూరగాయలు పొట్ట తగ్గించడంలో మేలు చేస్తాయి. పాలు, పెరుగు, మజ్జిగ, రాగులు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు తినడం తగ్గించి, అధికంగా నీరు తాగాలి. అన్నింటికీ మించి తగినంత నిద్ర, విశ్రాంతి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. ఈ జాగ్రత్తలతో మీ పొట్టను ఇట్టే తగ్గించుకోండి.