గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి చికిత్స చేస్తూ..తను కూడా గుండెపోటుకు గురయ్యారు ఓ వైద్యుడు. వైద్యం అందించేలోగానే ఆ డాక్టర్ తుదిశ్వాస విడిచాడు. దీంతో రోగిని అంబులెన్సులో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా అతనూ మార్గమధ్యలోనే కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోత్ జగ్గు ఆదివారం ఉదయం గుండెనొప్పితో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధారి మండల కేంద్రంలోని ఎస్‌వీ శ్రీజ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిని నడుపుతున్న డాక్టర్ డి. లక్ష్మణ్ (45) వెంటనే వైద్య సేవలు మొదలు పెట్టారు. రోగిని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే డాక్టర్‌కు గుండెపోటు వచ్చింది.
ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది వెంటనే సమీపంలో ఉన్న మరో ఆస్పత్రి వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం అందించే ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే మరణించారు. అదే సమయంలో రోగి జగ్గును అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అటు డాక్టర్, ఇటు రోగి నిమిషాల వ్యవధిలో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది.