మనం రోజూ తినే వంటకాల్లో జీలకర్రను తప్పకుండా వినియోగిస్తాము. మసాలా దినుసుల్లో భాగమైన ఈ జీలకర్రను రెగ్యూలర్‌గా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వికారం, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. జీలకర్రలో ఉండే క్రిమినాశక గుణాలు.. గాయాలను నయం చేయడంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీలకర్రను సరైన మోతాదులో తీసుకుంటే.. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో పాటు.. శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తుంది. జీలకర్రలోని యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు.. ఉదరం, కాలేయంలో ఏర్పడే ట్యూమర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
అందుకే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే జీలకర్రను తినాలని సూచిస్తున్నారు నిపుణులు. వంటలో కంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ఇక ఆలస్యం చేయకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుత కరోనా కాలంలో చాలా మంది ఔషధ గుణాలు కలిగిన మూలికల కషాయాలను తయారుచేసుకుని తాగుతున్నారు.దానికి గల కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఉద్దేశ్యం. అయితే, మూలికలతో పాటు జీలకర్రతో చేసిన నీటిని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది:మతి మరుపు సమస్యను జీలకర్ర దూరం చేస్తుంది. ఉదయాన్ని ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జీలకర్రలోని మూలకాలు నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీలకర్ర మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలకు మెరుగైన పోషణను అందించడానికి సహాయపడుతాయి. ఇందుకోసం జీలకర్ర గింజలను రాత్రి నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఆ తరువాత నానబెట్టిన జీలకర్రను తినాలి.
మొటిమల సమస్యను నివారిస్తుంది.. జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెడుతుంది. తరచుగా మొటిమలు మిమ్మల్ని వేధిస్తు్న్నట్లయితే.. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగాలి. రాంగ్ డైట్ వల్ల కలిగే ప్రభావం ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపైనా చూపుతుంది. ఈ కారణంగా మొటిమలు వస్తాయి. అయితే, జీలకర్రను ఉదయాన్నే తినడం వలన.. అందులోని యాంటీ బాక్టీరియల్ మూలకాలు.. మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.
గర్భిణీలు జీలకర్ర నీటిని తాగడం వల్ల వారిలో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. దీంతో గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.పాలిచ్చే తల్లులు రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది. తల్లీ బిడ్డలను ఆరోగ్యంగా ఉంచుతుంది.