These foods are must be avoidable in Winter season: చల్లని గాలులు.. నాలుగు గంటలకే అలముకుంటున్న చీకట్లు.. వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే వస్తున్న వంటకాల ఘుమఘుమలు.. పునుకులు, మిర్చీ బజ్జీ కారం కారంగా తినాలనో.. లేదా మత్తెక్కిస్తున్న మసాలా వాసన తగిలిన ఫాస్ట్ ఫుడ్స్‌ను పొట్టలో వేసాయాలని అనిపిస్తుందంటే.. చలికాలం వచ్చేసినట్లే.. కానీ రోడ్డు పక్కన వంటకాలు తినాలనుకోవటం.. జిహ్వా కొత్త రుచులు కోరుకోవటం సహజమే.. కానీ శీతాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. మరి అవేంటో తెలుసుకుందాం రండి…
నూనెలో వేయించి.. అప్పుడే వేడివేడిగా.. కరకరలాడుతూ మన ప్లేటులోకి పెట్టి ఇచ్చేవి ఏదైనా.. ఆబగా తినేస్తాం కదా ఈ కాలంలో.. ఈ శీతాకాలంలో ఉండే మాయే అది. వేడిగా అలా క్రిస్పీగా ఉండేవి ముక్కుకు బాగా నచ్చుతాయి.. కళ్లను ఇంకా బాగా ఆకర్షిస్తాయి.. ఇక నాలుక అయితే ఇంకెతసేపు అన్నట్లు నీళ్లూరుతుంది. కానీ నూనెలో వేయించిన ఆహార పదార్థాలు శీతాకాలంలో తినటం అంత శ్రేయస్కరం కాదు. వీటిలో అధిక కొవ్వులు ఉండటం కారణంగా.. త్వరగా అనారోగ్యబారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సీజనల్ పంటలు ఎలా ఉంటాయో.. సీజనల్ వ్యాధులు అలా ఉంటాయి. శీతాకాలంలో(Winter season) ముఖ్యంగా ఉండే సీజనల్ జబ్బు జలుబు. మనల్ని ముప్పుతిప్పులు పెట్టేసి.. మూడు చెరువుల నీరు తాగించేస్తుందీ జలుబు. జలుబు ఒక్కటి వస్తే చాలు, దానితో పాటు నేనున్నా తోడుగా అంటూ తలనొప్పి, జ్వరం కామన్‌గా వచ్చేస్తాయి. ఇటువంటి సమయంలో పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచదని వైద్యులు సూచిస్తున్నారు. పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు మన శరీరంలో శ్లేష్మాన్ని మరింతగా పెంచేందుకు తోడ్పడతాయి. దీనివల్ల జలుబు తగ్గటం దేవుడెరుగు.. మరింత ఎక్కువయ్యి.. ఆఫీసులకు వెళ్లేవాళ్లు సెలవులు పెట్టుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.
స్వీట్స్, కేకులు చూస్తే.. ఎంతటి పెద్దవారైనా చిన్నపిల్లల్లా మారిపోతారు. కానీ శీతాకాలంలో వీటిని దూరం పెట్టడమే ఉత్తమమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు వైద్యులు. కెఫీన్ ఉండే పానీయాలు అంటే కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటిని తీసుకోకపోవటమే ఉత్తమం అని చెప్తున్నారు. సీ విటమన్ ఎక్కువుగా ఉండే నారింజ, నిమ్మ జాతికి చెందిన వాటిని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. శీతాకాలంలో కచ్చితంగా ద్రాక్ష, యాపిల్, కమలా పైనాపిల్ అరటిపండ్లు తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి కాపాడుకోవచ్చునట. చల్లని నీళ్లకు బదులు వేడి నీళ్లు తాగటం ఉత్తమం అని డాక్టర్లు సూచిస్తున్నారు. కాబట్టి వేపుళ్లు, మసాలాలకు, కెఫీన్‌కు దూరంగా ఉంటూ.. మంచు దుప్పటి కప్పుకొని.. అందంగా కనిపించే ప్రకృతిని ఎంజాయ్ చేయండి.