నేడే వరల్డ్ ఎగ్ డే: గుడ్డు ఈజ్​ గుడ్

0
104

గుడ్డు అత్యంత శ్రేష్టమైన ఆహారం. పోషణలో తల్లిపాల తర్వాత గుడ్డుదే రెండో స్థానం. అనేక విటమిన్లు, మినిరల్స్‌‌తో నిండిన సూపర్ ఫుడ్డు ఎగ్‌‌. దీనిలో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ల, 78 కాలరీల శక్తి ఉంటుంది. వారానికి మూడుసార్లు ఉదయం రెండుగుడ్లను బ్రేక్‌‌ఫాస్ట్‌‌గా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయి.  కంటికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.

ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని  నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్​ న్యూట్రిషన్‌‌ సూచించింది. మన దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు  ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114 మాత్రమే.

ఈ విషయం గుర్తించిన మన ప్రభుత్వాలు విద్యార్థులకు, గర్భిణులకు, మధ్యాహ్న  భోజనం లాంటి పథకాల్లో గుడ్లు అందించి, పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. తెల్ల సొనలో అల్బుమిన్‌ పుష్కలంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది.

బ్యాచ్‌లర్స్ లైఫ్‌లోనైతే గుడ్లది ప్రత్యేకమైన పాత్ర. చాలా మంది అతి తక్కువ సమయంలో వంట చేసుకోవడానికి, శరీరానికి పోషకాల కోసం గుడ్లపై ఆధారపడుతుంటారు. కేవలం బాయిల్డ్ ఎగ్ మాత్రమే కాకుండా..వివిధ రకాలుగా గుడ్డును వినియోగస్తున్నారు. బిర్యానీలు, ఎగ్ బొండాలు ఇలా రకరకాలుగా గుడ్డు రోజువారి జీవితంలో భాగమైపోయింది.