Uterus Removal Side Effects | ఆడవారిలో గర్భసంచి తొలగింపుతో కీళ్లవాతం ముప్పు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చేసిన ఓ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. నలభై ఐదేళ్లకు ముందే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. మగవారికంటే ఆడవారిపై ఎక్కువగా ప్రభావం చూపే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లలో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా కీళ్లన్నీ ఎర్రటి వాపుతో మంటపుడుతుంటాయి. ఉదయాన్నే లేచినపుడు కీళ్లన్నీ బిగుసుకుపోయి కదలికలు కూడా అతి కష్టంగా మారతాయి.
సర్జరీ ద్వారా గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగించుకోవడం, నలుగురికంటే ఎక్కువ మందికి జన్మనిచ్చిన మహిళల్లో సైతం కీళ్లవాతం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యువతుల్లో 14 ఏళ్ల తర్వాత రుతుక్రమం మొదలైనపుడు, 33 సంవత్సరాల కంటే ముందే సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లిన వారు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కి గురయ్యే పరిస్థితులు అధికంగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు.
Uterus Removal Side Effects | ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప.. అది కూడా డాక్టర్లు సూచించినపుడు మాత్రమే గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకోవాలని, పిల్లలు పుట్టేశాక ఇక గర్భసంచితో పని లేదని, నెలనెలా రుతుక్రమం బెడద తప్పుతుందని అనవసరంగా గర్భాశయాన్ని తొలగించుకోవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ లో 2.2 లక్షల మంది మహిళలకు సంబంధించిన వివరాల్ని సేకరించి చైనా పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. పరిశోధన వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్ కి చెందిన ఆర్ఎండీ ఓపెన్ లో ఇటీవల పబ్లిష్ అయ్యాయి.