Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత ఊసూరు మనిపిస్తాయి. దాదాపు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది. కొందరికి వీటిపై ఉండే ఇష్టం మోతాదు కాస్త ఎక్కువగా ఉంటే మరికొందరికి మాత్రం వీటిని తినకుండా రోజు గడవదు. అలాంటి వారికి వైద్య నిపుణుల తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. స్వీట్స్ ప్రతి రోజూ తూచా తప్పకుండా తింటుంటే.. అంతే తూచా తప్పకుండా తిన్న స్వీట్స్‌కు రెట్టించిన వ్యాయామం చేయాలని చెప్తున్నారు. అలా చేయకపోతే అది మన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. స్వీట్ ఐటమ్స్‌లో చాలా వరకు మైదా, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి అధికంగా తినడం వల్ల, ప్రతి రోజూ తినడం వల్ల గ్లూకోజ్ అంతా కూడా శరీరంలో గ్లైకోజెన్‌గా నిల్వ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే స్వీట్స్ అధికంగా తిన్న తర్వాత నీరు తప్పకుండా తాగాలని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎంత చేసినా.. ఏం చేసినా ప్రతి రోజూ స్వీట్స్ తూచా తప్పకుండా తినడం మన ఆరోగ్యంపై దుష్ప్రభావమే చూపుతుందని, కాబట్టి రోజూ స్వీట్స్ తినే అలవాటును క్రమంగా తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఆర్టిఫీషియల్ స్వీట్స్‌ను అధికంగా తినడం వల్ల శక్తి కోల్పోయే అవకాశం ఉందని, ఫలితంగా అలసట, నీరసం, బద్దకం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. స్వీట్స్ తిన్న(Eat Sweets) తర్వాత భోజనం చేస్తే కొవ్వు పెరిగిపోతుందని, రోగనిరోధక శక్తిపై ప్రభావం అధికంగా ఉండి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. పంచదార, పంచదార ఉత్పత్తులు ప్రతి రోజూ తినడం వల్ల డిప్రెసివ్‌గా అనిపిస్తుందని, స్వీట్స్ తినడం మనకు ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించినా దీని ప్రభావం ఆరోగ్యం దీర్ఘకాలికంగా తీవ్రంగా ఉంటుందని, కాబట్టి వీలైనంత వరకు స్వీట్స్‌ను అధికంగా తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.