ప్రస్తుత తరం యువతలో సకల రోగాలకు ఉప్పు, చక్కెరే ప్రధాన కారణాలని, వాటిని నియంత్రించుకుంటే ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటిలో చక్కెరను పూర్తిగా మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని అంటున్న నిపుణులు.. ఉప్పు(Salt) విషయంలో మాత్రం వేరేలా మాట్లాడుతున్నారు. ఏ కారణం చేతనైనా ఒక్కసారి ఉప్పు తీసుకోవడాన్ని మానేస్తే మన ప్రాణాలకే ముప్పు తప్పదని అంటున్నారు పోషకాహార నిపుణులు కూడా. కారణం ఏదైనా ఉప్పు తీసుకోవడం తప్పనిసరిగా ఉండాలని, కానీ అది నియంత్రణలో ఉండాలని చెప్తున్నారు. ఉప్పు మానేయడం మన శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుందని అంటున్నారు. ఉప్పుతో ఎంత ప్రమాదం ఉన్నా మన శరీరానికి ఉప్పు తప్పనిసరిగా కావాల్సిన లవణం అని.. దానిని కావాల్సిన మోతాదులో తప్పక తీసుకోవాలని చెప్తున్నారు. అసలు ఇంతకీ 30 రోజుల పాటు ఉప్పు తీసుకోవడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..
ఒక్కసారిగా ఉప్పు తినడం మానేస్తే.. అమాంతం మన బరువు తగ్గిపోతుంది. బాన పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కూడా వెన్నలా కరిగిపోతుంది. అయితే ఒక్కసారిగా అధిక మొత్తంలో బరువు తగ్గడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దాంతో పాటుగా జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుందని, పేగులను కూడా ప్రభావితం చేసి కడుపు నొప్పి సహా పలు ఇతర సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఉప్పు(Salt) మానేయడం వల్ల మన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి, లో బీపీ, ఆందోళనకు గురిచేస్తుంది. వీటి బారిన పడకుండా చూసుకోవాలంటే ప్రతిరోజూ పరిమితి మొత్తంలో ఉప్పును తీసుకోవడం మంచిది. ఏదైనా మన ఆహారంగా అలవాటైన వస్తువులను ఒక్కసారిగా తినడం మానేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, జంక్ ఫుడ్ కూడా మానేస్తే కొన్ని దుష్ప్రభావాలను చూపుతుందని, దేనినైనా క్రమంగా మానేయాలే తప్ప ఒక్కసారిగా మానేయడం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. కానీ కొన్ని అలవాట్లను మాత్రం ఒక్కసారిగా వదులుకోవడం ఊహించని మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు.