ప్రతీ ఇంటిలో పూజ చేసే సమయంలో కచ్చితంగా దీపం వెలిగిస్తారు. అయితే అమ్మవారి కృప లక్ష్మీకటాక్షం ఉండాలని ఇలా అమ్మవారికి దీపం వెలిగిస్తారు. ఆ ఇంట అంతా శుభం కలగాలి అని కోరుకుంటారు. దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి దేవుని ముందు వెలిగిస్తారు.
అయితే ఇప్పుడు మనం చెప్పుకునే విషయం కామాక్షి దీపం గురించి. దీపపు ప్రమిదకు వెనుక గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు. ఇలా ఆ దీపం వెలిగిస్తే ఆ ఇంట సిరిసంపదలు ఉంటాయి. అంతేకాదు ఆ కామాక్షి అమ్మవారి కృప ఉంటుంది. కేరళ తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో గజ దీపం అని కూడా పిలుస్తారు.
కొందరు తరతరాలుగా ఇలా పూజిస్తూ ఉంటారు. కొన్ని వంశాలవారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం ఆచారంగా పాటిస్తున్నారు. ఈ దీపం వెలిగించే సమయంలో ముందు అమ్మవారికి నమస్కరించుకుని కుంకుమ, పుసుపు వేసి పూజించాలి గంధం రాయాలి. పుష్పాలతో అలంకరించి అక్షింతలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి. కామాక్షి అమ్మవారి దీపంలో ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి. పౌర్ణమి రోజు వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలం.