ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. మరో పక్క జికా వైరస్ కూడా ఇప్పుడు అందరిని టెన్షన్ పెట్టిస్తోంది. ఇలా వరుసగా వైరస్ల దాడితో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. తాజాగా ఈ జికా వైరస్ అందరిని భయపెడుతోంది. అంటువ్యాధి అయిన ఈ జికా వైరస్తో ప్రాణాలకే ముప్ప వాటిల్లొచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగ్యూ, మలేరియా మాదిరిగానే జికా కూడా ఒక రకమైన వైరస్. ..
ఇది కూడా దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా దోమల ద్వారా వస్తుంది. ఇక పగటిపూట కుట్టే దోమల ద్వారా ఇది బాగా వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం. జికా వైరస్ను 1947 లో ఆఫ్రికాలో మొదటగా గుర్తించడం జరిగింది. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ ఇక్కడ మన దేశంలో కూడా కేసులు వస్తున్నాయి.
ఈ వైరస్ ఈడెస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ సోకగానే మొదటి లక్షణం జ్వరం కనిపిస్తుంది. తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు ఒక వారం పాటు కనిపిస్తే వెంటనే వైద్యుల దగ్గరకు వెళ్లాలి.ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. త్వరగా ఈ వైరస్ ని గుర్తిస్తే వెంటనే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు.