Urine Colour |మనకు ఎటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నా మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించే విషయమే. కానీ చాలా సందర్భాల్లో వాటిని మనం నిర్లక్ష్యం చేయడం వల్లే వ్యాధి ముదిరి మంచానికెక్కిస్తుంది. అయితే వీటిలో చాలా సంకేతలను మనం తెలియకనే నిర్లక్ష్యం చేస్తాం. అలాంటి వాటిలో మన మూత్రం రంగు కూడా ఒకటి. మన మూత్రం రంగు మన ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడిస్తుంది. ఉన్న రోగాలనే కాకుండా వచ్చే ప్రమాదం ఉన్న సమస్యలను కూడా మన మూత్రం రంగు చాలా సందర్భాల్లో చెప్తుంది. డీహైడ్రేషన్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో వ్యాధులకు సంబంధించిన సంకేతాలు మన మూత్రం రంగు ద్వారా అందుతాయి. మరి ఇంతకీ మన మూత్రం ఏ రంగులో వస్తే దాని అర్థం ఏంటో తెలుసుకుందాం..
ఎరుపు రంగు: ఈ రంగు మూత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. మూత్రం ఎర్రగా వచ్చిందంటే ఆ మూత్రంలో రక్తం కలిసిందని అర్థం. ఇది కిడ్నీ క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు వంటి వ్యాధులకు లక్షణాలుగా, సంకేతాలుగా భావించవచ్చు. ఈ రంగులో కనుక మూత్రం వస్తే ఎటువంటి ఆలస్యం చేయకుండా వైద్యులను కన్సల్ట్ అవ్వాలి. అయితే కొందరిలో బీట్‌రూట్, బ్లాక్ బెర్రీలు తిన్న సమయంలో ఉదయం లేచిన తర్వాత తొలిసారి చేసే మూత్ర విసర్జనలో, కొన్ని అరుదైన సందర్భాల్లో వాటిని తిన్న తర్వాత చేసే తొలి మూత్ర విసర్జనలో ఎర్రటి మూత్రం వచ్చే అవకాశం ఉంది.
ముదురు పసుపు: ముదిరిపోయిన పుసుపు రంగులో మూత్రం రావడం కూడా ఏమాత్రం మంచి సంకేతం కాదు. సాధారణంగా లేత పసుపు రంగు మూత్రం వస్తుంది. కానీ ఈ రంగు ముదిరి దగ్గర దగ్గర నారింజ రంగును తలపిస్తే ఇది తీవ్రమైన డీహైడ్రేషన్‌ను సూచిస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా శారీరిక శ్రమ చేయడం, వేడి ప్రాంతాల్లో ఉండటం వల్ల కూడా మూత్రం ఈ రంగులో వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స తీసుకోకపోతే ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయొచ్చు. కాగా దీనిని తగ్గించుకోవాలంటే ప్రతి రోజూ శరీరానికి సరిపడా నీరు తీసుకుంటే సరిపోతుంది. తేనే రంగు మూత్రం కూడా శరీరానికి సరిపడా నీరు అందడం లేదన్న సంకేతాన్నే ఇస్తుంది.
పాల రంగు: పాల రంగు లేదా పొగమంచు తరహా మూత్రం వస్తే అది బోదకాలకు సంకేతం. మూత్రం రంగు పాల రంగుతో పాటు దుర్వాసన వస్తుంటే ఇది ఇన్ఫెక్షన్‌ను కూడా సూచిస్తుంది. కావున వెంటనే వైద్యులను సంప్రదించాలి. బాక్టీరియా, శిలీంధ్రాలు, పలు వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రం పాల రంగులో వస్తాయి.
నలుపు రంగు: నలుపు లేదా కాఫీ రంగులో మూత్రం వస్తుందంటే ఇది యూరోబిలినోజెన్ అనే వ్యాధిని సూచిస్తుంది. ఇది కాలేయ సంబంధిత వ్యాధి లక్షణం. అంతేకాకుండా ఫావా బీన్ అనే బీన్స్‌ను ఎక్కువగా తినడం వల్ల కూడా మూత్రం(Urine Colour) ఈ రంగుల్లో వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా మలేరియా జ్వరం వచ్చినప్పుడు తీసుకునే ఔషదాలు, కొన్ని యాంటీబయోటిక్స్ వల్ల కూడా మూత్రం రంగు కాఫీ రంగు లేదా నల్లగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రోజుల తరబడి నల్ల రంగులో మూత్రం వస్తుంటే ఇది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది.
ఆకుపచ్చ: అత్యధికంగా అలోపతీ మందులు తీసుకోవడం వల్ల, ఫుడ్ కలర్స్ కలిపిన ఆహారాలు తీసుకోవడం వల్ల మూత్రం ఈ వింత రంగులో వచ్చే అవకాశం ఉంది. కానీ ఆకుపచ్చ, నీలం రంగులో మూత్రం తరచుగా వస్తూంటే మాత్రం వైద్యుడిని కలవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
క్లియర్: మూత్రం ఎటువంటి రంగు లేకుండా.. నీటి తరహాలో వస్తే నీరు అధికంగా తీసుకుంటున్నామని అర్థం. మన శరీరంలో ఓవర్ హైడ్రేషన్‌లో ఉందని ఇది సూచిస్తుంది. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావాల్సిన మినరల్స్ కూడా మూత్రం ద్వారా పోయి పలు సమస్యలకు దారితీస్తుంది.