Eggs Benefits | గుడ్డు తినడం చాలా మంచిది. ఈ విషయం వైద్యులు కూడా చెప్తారు. గుడ్లు తరచుగా తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు చెప్తున్నారు. గుడ్డులో క్యాలరీలు తక్కువగా ఉండి, ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. ఒక్కో గుడ్డులో 75 కేలరీలు ఉంటాయి. దీంతో పాటుగా ఫ్యాట్, ప్రోటీన్, పొటాషియం, విటమిన్లు, సోడియం, జింక్, కాల్షియం, సెలీనియం వంటి మరెన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి దోహదపడతాయి. అందుకే గుడ్డును ఎలా తీసుకున్నా మనకు మంచే చేస్తుంది.
ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి గుడ్డు అనేది ఒక సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. ప్రొటీన్ అంత త్వరగా జీర్ణం కాదు. తద్వారా ఎక్కువ సేపు మన కడుపు నిండుగా ఉంటుంది. జంక్ ఫుడ్ వైపు మన మనసు మల్లదు. అందుకే రోజుకు ఒక్క గుడ్డైన తినాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ గుడ్డును కూడా తినే సమయాన్ని బట్టే అది అందించే లాభాలు మన శరీరానికి అందుతాయని చెప్తున్నారు. అసలు గుడ్డు తింటే వచ్చే లాభాలేంటి? ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలు ఒకసారి తెలుసుకుందామా..
గుండె పదిలం: గుడ్లలో గుడ్ కొలెస్ట్రాల్ బాగుంటుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజూ ఒక గుడ్డు తినేవారికి అంత త్వరగా గుండె సంబంధిత సమస్యలు రావు. మంచి కొలెస్ట్రాల్ మనకెప్పుడూ మేలే చేస్తుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే చెడు కొలెస్ట్రాల్ మాత్రం మనకు లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడం: గుడ్లు మన బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అందువల్ల గుడ్డు తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఆకలిగా అనిపించదు. ఇది మన బరువు తగ్గడానికి పనిచేస్తుంది. కడుపు నిండుగా ఉండటం వల్ల జంక్ ఫుడ్ తినాలి, లేదా ఏదో ఒకటి తినాలి అన్న కోరికలు తగ్గుతాయి. గుడ్డు రోజూ తినడం ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని వైద్యులు చెప్తున్నారు.
కండపుష్టికి: జిమ్ చేసే వారికి గుడ్డు.. ఒక సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. వీటిని రోజూ తింటే వర్కఅవుట్స్ వల్ల దెబ్బతినే మజిల్ టిష్యూస్‌ను వేగంగా రిపేర్చేస్తుంది. అంతేకాకుండా మజిల్ మరింత బలంగా, ఎక్కువగా పెరగడానికి కూడా దోహదపడుతుంది. అందుకే చాలా మంది జిమ్ చేసే వారికి గుడ్డు తినమని సూచిస్తుంటారు. గుడ్డు తినడం వల్ల మజిల్స్‌తో పాటు మన మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపు సమస్యలను దూరం చేయడంలో కూడా గుడ్డు కీలకంగా వ్యవహరిస్తోంది.
ఎప్పుడు తీసుకోవాలి..
గుడ్డును ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు తీసుకుంటున్నా అన్న దాన్ని బట్టి దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. గుడ్డుని ఉదయం తీసుకుంటే.. అది మన మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దాంతో రోజంతా ఎనర్జీగా ఉంటాం. చాలా సేపటి వరకు ఆకలి కూడా వేయదు. దీంతో మధ్యాహ్న భోజనం సమయం వరకు కూడా ఆకలి సమస్య లేకుండా ఉంటుంది. గుడ్లలో కొలైన్ ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్‌మీటర్ ప్రొడ్యూస్ అవడానికి సహాయపడుతుంది. ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే చాలా వరకు గుడ్డును ఉదయాన్ని అల్పాహారం సమయంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
అదే విధంగా రాత్రి సమయాల్లో గుడ్డును తినడం వల్ల కూడా అనేక లాభాలు(Eggs Benefits) ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. రాత్రి సమయంలో గుడ్డు తింటే.. మన మజిల్స్ రిపేర్ అవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిద్రపోయే సమయంలో గుడ్లలో ఉండే అమైనో యాసిడ్స్.. మన బాడీ మజిల్స్‌ను పెంచి బలంగా మారుస్తాయి. అంతేకాకుండా గుడ్డు రాత్రి సమయంలో తినడం వల్ల నాణ్యమైన నిద్ర కూడా లభిస్తుందని చెప్తున్నారు. కాగా గుడ్డు తినే వారు తమ అవసరాలను బట్టి తీసుకోవాలని, ఎప్పుడు తిన్నా గుడ్డు వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.