కొంచెం మందికి చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావటం మనం చూస్తుంటాం. ఈరోజుల్లో ఇది సర్వసాధారణమే, జీవశైలి మారటం, తీసుకునే ఆహారాలు మారటం వంటి వాటివల్ల జుట్టు రంగు మారుతోంది అని సర్ది చెప్పుకోకండి. అతి చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వస్తుందంటే, గుండె జబ్బులకు సూచన కావొచ్చు, జాగ్రత్తపడండి అంటున్నారు నిపుణులు.
గుండె జబ్బులు, తెల్ల జుట్టుకు ఉన్న సంబంధంపై యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో 42 నుండి 64 సంవత్సరాల వయస్సు గల 545 మంది వయోజన పురుషులను తీసుకొని, అధ్యయనం ప్రారంభించారు. ఫలితాల ప్రకారం గుండె సమస్యల లక్షణాలతో బాధపడుతున్న వారిలో 80 శాతం మందికి తెల్లజుట్టు ఎక్కువుగా ఉందట. కాబట్టి తెల్లజుట్టు మెుదలయ్యిందంటే, గుండె జబ్బులు కూడా మెుదలైనట్లేననీ.. ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఛాతిలో నొప్పిలో క్రమంగా రావటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగటం, తిన్నది అరగకపోవటం, గుండెల్లో మంటలా అనిపించటం, శరీరం ఎడమవైపు నొప్పులు, వాపు రావటం, జుట్టు అసహజంగా ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించటం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, జంక్ ఫుడ్‌ను దూరం పెట్టడం, క్రమం తప్పని వ్యాయామం, మద్యపానం, ధూమపానం వాటికి దూరంగా ఉండటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని డాక్టర్లు చెప్తున్నారు. జుట్టు నెరిస్తే బాల మెరుపు అంటూ సాకులు చెప్పటం మానేసి.. వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు.