పక్షవాతంతో జాగ్రత్తగా ఉండాల్సిందే..లేదంటే అంతే సంగతి!

0
94

పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతము’  అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది. ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు.

కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది. దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు. పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 29న వరల్డ్‌ స్ట్రోక్‌ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది. ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.

పక్షవాతం బారిన పడితే అన్నం తినలేరు..నడవలేరు సొంతంగా ఏ పని చేసుకోలేరు. పక్షవాతం వస్తే ఉన్నట్టుండి కింద పడిపోతారు. మరి పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినప్పుడు ఒక కాలు, చేయి ఆడదు. చూపు మందగిస్తుంది. మాట సరిగా రాదు.

తలనొప్పి, వాంతులు అవుతాయి.

పక్షవాతం వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తొలి గంటలో వైద్యులకు చూపించగలిగితే పక్షవాతం నుంచి రక్షించుకోవడానికి సాధ్యం అవుతుంది.