Munugode Bypoll :మునుగోడు ఉపఎన్నిక పోలీంగ్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో.. రోజురోజుకు రాజకీయ హీట్ పెరుగుతోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోణలతో ప్రచారం సాగిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను తెలంగాణలోని ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచిన పార్టీకే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టంగట్టే అవకాశం ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు.
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారంటూ ఇప్పటి వరకు ఆరోపణలు గుప్పించిన ప్రత్యర్థులు.. తాజాగా పోస్టర్లు వేసి మరో ముందడగు వేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ పోస్టర్లను ఏర్పాటు చేశారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డికి కేటాయించారంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ ప్రింట్ చేసి.. చండూరులో రాత్రికి రాత్రే వేలాది పోస్టర్లను అతికించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక (Munugode Bypoll) మరింత రంజుగా మారింది. కాగా, నామినేషన్ దాఖలు చేసిన రాజగోపాల్ రెడ్డి.. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఆరోపణలు చేస్తున్న వారు రాజీనామా చేయగలరా అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.