ఈ కాలంలో బరువు తగ్గడం ఎంత పెద్ద సమస్యగా మారిందో.. చాలా మందికి బరువు పెరగడం(Weight Gain) కూడా అంతే పెద్ద సమస్యలా మారింది. చాలా మంది ఎంత ప్రయత్నించినా బరువు పెరగడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగకుండా, బక్కపల్చగానే ఉంటుంటారు కొందరు. తోబుట్టువులు, కుటుంబీకులు, స్నేహితులు అందరూ కూడా వెక్కిరిస్తుంటే ఏం చేయాలో అర్థంకాక ఆత్మన్యూనతకు కూడా గురవుతుంటారు. కానీ వాళ్లు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో తయారు చేసుకునే స్మూతీలను తాగడం ద్వారా బరువు పెరగొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. బరువు పెరగడం కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఇంట్లో దొరికే కూరగాయాలు, కొన్ని పండ్లతో బరువు పెరగొచ్చని నిపుణుల వివరిస్తున్నారు. మరి ఆ స్మూతీలు ఏంటి, వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామా.
వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలు, గింజలతో మనం బరువు పెరగొచ్చని, వీటిని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. ఈ స్మూతీల్లో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అన్నీ కూడా మన బరువు పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి ఇవి బెస్ట్ అని, వీటిని తాగుతూ రోజూ వ్యాయామం, జిమ్ చేయడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరాన్ని బిల్డ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి ఈ స్మూతీలను ఎలా తయారు చేసుకోవాలంటే..
అవకాడో, చాక్లెట్ స్మూతీ: దీనిని తయారు చేసుకోవడానికి ఒక అవకాడో, పాలు లేదా కొబ్బరి పాలు ఒక గ్లాసు, కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక బ్లెండర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్మూతీలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెంచడం కీలక పాత్ర పోషిస్తాయి.
ఓట్స్, ప్రొటీన్ స్మూతీ: అరకప్పు ఓట్స్, ప్రొటీన్ పౌడర్ ఒక స్పూన్, ఒక అరటిపండు, పాలు ఒక కప్పు, చిన్న కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, క్యాలరీలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి మన బరువు వేగంగా, ఆరోగ్యకరంగా పెంచుతాయి.
బెర్రీ, కొబ్బరి స్మూతీ: దీని కోసం బ్లూబెర్రీలు లేదా స్ట్రా బెర్రీలను ఒక అర కప్పు తీసుకోవాలి. కొబ్బరి పాలు ఒక కప్పు, చియా విత్తనాలు టేబుల్ స్పూన్, పావు కప్పు పెరుగు తీసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. తయారైన మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసుకుని లాగించేయడమే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కేలరీలు అధికంగా ఉండి బరువు పెరిగేలా చేస్తాయి.
పీనట్ బటర్, అరటిపండు: వెన్న రెండు టేబుల్ స్పూన్లు, పాలు ఒక కప్పు, తేనె ఒక టేబుల్ స్పూన్, అరటి పండు ఒకటి తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అంతే స్మూతీ రెడీ. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగడం(Weight Gain)లో ఎంతో సహాయపడతాయి.
ఈ స్మూతీల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కాకపోతే ఏమైనా ఎలర్జీస్ ఉంటే మాత్రం స్మూతీలను జాగ్రత్తగా ఎంచుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటుగా మరికొన్ని ఇతర కాంబినేషన్స్‌ను కూడా ట్రై చేయొచ్చని అంటున్నారు.