అందంగా కనిపించాలి. అందరూ మనల్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి. అని చాలా మంది కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. కొందరికి వారి అలవాట్ల వ్యవహారాల వల్ల చిన్న వయసులోనే చర్మం ముడతలు(Tips for Wrinkles) పడటం మొదలవుతుంది. దాని వల్ల 20 ఏళ్లకే 40 ఏళ్ల వ్యక్తిలా కనిపించడం, చర్మంలో మెరుపును కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. ఇందుకు పెరుగుతున్న కాలుష్యం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రధానంగా మొఖంపై వచ్చే ముడతలు యువతను ఎక్కువగా చికాకు పెడతాయి. వాటిని తగ్గించడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్లర్లకు కూడా వెళ్తుంటారు. కానీ వాటి వల్ల సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది కానీ అది మన సమస్యకు పరిష్కారం కాదు.
దీనిని మెయింటెయిన్ చేయడం కోసం నెలకు ఒకసారో, రెండు సార్లో బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. లేని పక్షంలో కాస్తంత ఖర్చు పెట్టుకుని బ్యూటీ నిపుణుల దగ్గర కొన్ని రకాల ఇంజెక్షన్లు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. వాటి ప్రభావం మూడు నెలల వరకు ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. కానీ చిన్న వయసులోనే మొఖంపై ముడతలు(Tips for Wrinkles) వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ ముడతలను కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోనే తగ్గించేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటి.. ఎలా చేయాలో తెలుసుకుందామా..
కొబ్బరినూనె: కాస్తంత కొబ్బరినూనెను గోరు వెచ్చగా చేసుకోవాలి. ఆ నూనెను రాత్రి పడుకునే ముందు మొఖానికి బాగా పట్టించాలి. మొఖానికి నూనె పెట్టే సమయంలో ఒక దిశలో మర్దనా చేయాలి. రాత్రంతా నూనె మొఖానికే ఉంచుకుని ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారినికి ఒకటి రెండు సార్లు చేయడం ద్వారా మొఖంపై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నమాట. కొబ్బరి నూనెలో ఉండే ఫాటీ యాసిడ్స్ చర్మానికి పోషణనిస్తాయి. అంతేకాకుండా చర్మం సాగే గుణాన్ని పునరుద్దరించడంలో కూడా కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది.
కలబంద: మొఖం జిడ్డు, ముడతల సమస్యలతో బాధపడే వారికి కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జును మొఖానికి బాగా పట్టించాలి. ఒక అరగంట సమయం కలబందను ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో మొఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా చర్మంలో తేమ స్థాయిలు పెరిగి చర్మం సాగే గుణం పునరుద్దరించబడుతుంది. కలబంద గుజ్జులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఇది మొఖంపై ముడతలు, జిడ్డుతో పాటు డీహైడ్రేషన్, చలి వల్ల ముఖంపై ఏర్పడే గీతలను కూడా తగ్గిస్తుంది.
తేనె: చర్మాణికి కావాల్సిన పోషణ అందించడంలో, చర్మ కణాలను ఆరోగ్యవంతంగా మార్చడంతో పాటు వాటిని రక్షించడంలో తేనె కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మంపై తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. స్వచ్చమైన తేనెను ముఖమంతా రాసి బాగా ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంపై ముడతలు తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా చర్మంలో గ్లో కూడా పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌తో మొఖం మీద మర్దన చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ చర్మానికి బాగా పట్టిన తర్వాత ఒక గంట సేపు ఆరనివ్వాలి. కావాలనుకుంటే రాత్రి సమయంలో మొఖానికి ఆలివ్ ఆయిల్ రాసి ఉదయాన్నే కూడా కడిగేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్తో ముఖం మీద మసాజ్ చేసినపుడు చర్మకణాల్లో ఒత్తిడి తగ్గుతుంది. మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్, ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. దీనివల్ల నుదుటి మీద గీతలు, కంటి చుట్టూ ఉండే ముడతలు పోతాయి.
రోజ్ వాటర్: ఒక గిన్నెలో రెండు చెంచాల రోజ్ వాటర్, రెండు చెంచాల గ్లిజరిన్, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొఖానికి అప్లయ్ చేయాలి. 15-30 నిమిషాల తరవాత నీళ్లతో కడిగేస్తే ముఖం మీద పేరుకున్న మడ్డి, జిడ్డు తొలగిపోవడంతో పాటు చర్మం స్టిఫ్‌గా మారుతుంది. మొఖంపై ముడతలను(Tips for Wrinkles) తొలగించడానికి రోజ్‌వాటర్ ఒక మంచి చాయిస్ అని నిపుణులు చెప్తున్నారు.
కోడిగ్రుడ్డు: గ్రుడ్డులోని తెల్ల సొనని తీసుకుని మొఖానికి మందంగా పట్టించాలి. గుడ్డు సొన బాగా ఆరిన తరవాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా మంచి ఫలితముంటుంది. గుడ్డు మన చర్మానికి కావల్సిన పోషకాలకు అందించడంతో పాటు చర్మం సాగే గుణాన్ని పునరుద్దరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పెరుగు: కొంచెం పెరుగును ముఖమంతా పట్టించి ఇరవై నిమిషాల తరవాత నీళ్లతో కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు, మృతకణాలను తొలగించేందుకు సహాయం చేస్తుంది.
అరటిపండు: ఒక బౌల్‌లో అరటిపండును గుజ్జులా చేయాలి. అందులో ఒక చెంచా తేనె, రెండు చెంచాల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొఖానికి ప్యాక్‌లా పట్టించాలి. బాగా ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం తాజాగా ఉంటుంది.
గ్రీన్ టీ: ఇది మంచి టోనర్గా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీని తయారుచేసిన తరవాత ఒక స్ప్రే బాటిల్ లో పోసి తరచూ ముఖం మీద స్ప్రే చేసుకుంటూ ఉంటే ముడతలు, గీతలు, నల్లని మచ్చలు మాయమవుతాయి.
నిద్ర: మన ఆరోగ్యానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. సరైన, సరిపడా నిద్ర లేకపోతే చర్మం దగ్గర నుంచి శరీర అవయవాల వరకు తీవ్ర ప్రభావితమవుతాయి. అదే విధంగా చర్మంపై ముడతలు(Tips for Wrinkles) తగ్గించడంలో కూడా నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మంచి నిద్ర శరీరానికి స్వాంతన కలిగిస్తుంది. దీనివల్ల హార్మోన్ల పనితీరు సజావుగా ఉంటుంది. రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే ఒత్తిడి, అలసట తగ్గి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు.