Hostel: ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు తయారయ్యాయి ప్రస్తుత రోజులు. స్నేహం ముసుగులో మెత్తగా ముంచేస్తున్నారు. స్నేహితులమే కదా అని తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇటువంటి సంఘటనల్లో కంగారు పడకుండా.. ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు భరోసా ఇస్తున్నారు. హాస్టల్ (Hostel)లో చేరిన ప్రతి అమ్మాయి చుట్టు పక్కల పరిసరాలను గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా స్నేహం పేరిట అన్ని విషయాలను ఎటువంటి దాపరికాలు లేకుండా పంచుకోవటం అనేది ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఎంత స్నేహితురాళ్లు అయినప్పటికీ పరిధులు దాటకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారితో హాస్టల్‌లో పరిచయం ఏర్పడినంత మాత్రాన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు. వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ పాస్ వర్డ్‌లు వంటివి అస్సలు చెప్పకూడదు. అంతా అమ్మాయిలే, అందరూ తెలిసినవాళ్లే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు.
స్నానం చేసేటప్పుడు, దుస్తులు మార్చుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దుస్తులు మార్చుకునేటప్పుడు సరదాగా ఫోటో తీస్తున్నామన్నా అస్సలు ఉపేక్షించకండి. అటువంటి ఫోటోలు పొరపాటున మరొకరి కంట పడితే, తరువాత పరిణామాలు ఊహించుకోలేము. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం ఎంతో ఉత్తమం. అలా అని ఎవరితో సన్నిహితంగా ఉండకుండా, మూతి ముడుచుకొని ఉండమని కాదు.. స్నేహంలోనూ పరిధిలు విధించుకోవాలి.
ఇటీవల కాలంలో ఓ యువతికి సంబంధించిన ఫోటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. ఇంటర్‌నెట్‌లో పెట్టేశారు. ఫోటోల గురించి బాధిత యువతికి బంధువులు ఫోన్ చేసి చెప్పటంతో పోలీసులను ఆశ్రయించింది. తన ఫోటోలను తనతో పాటే హాస్టల్లో ఉంటున్న మరొక యువతి మార్ఫింగ్ చేయించి, ఇంటర్ నెట్‌లో పోస్ట్ చేయించిందని తెలియటంతో నిర్ఘారింతపోయింది. తనకంటే అందంగా ఉండటం, అందరితో కలివిడిగా ఉంటుందన్న అక్కసుతో బాధిత యువతి ఫోటోలను మార్ఫింగ్ చేయించినట్లు సదరు యువతి ఒప్పుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని జైలుకు తరలించారు.
ఫోటోలు మార్ఫింగ్, వీడియోలు లీక్ అవ్వటం వంటి ఘటనల్లో బాధిత యువతి తప్పు లేకపోయినా భయపడిపోతారు. కుటుంబ పరువు పోయిందనే భావనతో ఆత్మహత్య వంటి ఘటనలకు పూనుకుంటారు. ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని తెలంగాణ షీ టీమ్ పోలీసులు సూచిస్తున్నారు. బాధితుల పేర్లు, వివరాలు బయటకు రాకుండా సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇటువంటి ఘటనల్లో ఆడవారే నిందితులైనా, శిక్షలు కఠినంగా ఉంటాయని షీ టీమ్ పోలీసులు హెచ్చరించారు.