మన పూర్వీకులు ఏ ఆచారాన్ని మొదలుపెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం కచ్చితంగా ఉంటుంది. పూర్వం పూజ గదిలో తప్పకుండా పచ్చ కర్పూరాన్ని ఉంచేవారట. అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుందని వారి విశ్వాసం. అయితే కర్పూరం లో మూడు రకాలు ఉన్నాయి. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం. ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య వ్యత్యాసం, పచ్చ కర్పూరం విశిష్టత గురించి తెలుసుకుందాం.
పచ్చకర్పూరాన్ని సంస్కృతంలో హిమ కర్పూరం అంటారు. హిమాలయ పర్వతాలల్లో ఉండే వృక్షాల ద్వారా పచ్చ కర్పూరాన్ని తయారు చేస్తారు. హిందీలో భీంసేని కర్పూరంగా పిలుస్తారు. పచ్చ కర్పూరం పచ్చగా ఉండదు. తెల్లగా, చిన్నచిన్న బిళ్ళలుగా ఉంటుంది. నిల్వకాలం పెరిగిన తరువాత కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది. స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఆవిరైనప్పుడు ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మాయం అవుతుంది. అదే దాని స్వచ్ఛతకు గుర్తు.
హారతి కర్పూరం టర్పంటైన్ లాంటి కెమికల్స్ తో తయారు చేస్తారు. హారతి కర్పూరం తినకూడదు. ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఔషధ యోగ్యమైనవి. ఇందులో పచ్చ కర్పూరం శ్రేష్టమైంది. శక్తికలది. మూడు సార్లు బట్టీ పెట్టి కాల్చి తయారు చేసిన పచ్చ కర్పూరం స్వచ్ఛమైంది. దీన్ని మనం తినే పదార్ధాల్లో వేసుకున్నా, దేవుడి పూజ గదిలో ఉంచుకున్నా ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలు పొందొచ్చు. పచ్చ కర్పూరం అంటే స్వచ్ఛమైందని అర్ధం. తినడానికి అర్హత కలిగిందని అర్ధం. నిజానికి దేవుడి హారతి కూడా ఈ స్వచ్ఛమైన పచ్చ కర్పూరంతోనే ఇవ్వాలి. కానీ ఖర్చుకు భయపడి కెమికల్ తో తయారైన తక్కువ రేటు హారతి కర్పూరంతో హారతి ఇస్తున్నాం. దీని ద్వారా పూజ పవిత్రతే కాదు.. వాతావరణం, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కెమికల్ హారతి కర్పూరం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి.
పచ్చకర్పూరం ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే… ప్రతి రోజు పూజ సమయంలో చిన్న కప్పులో రెండు నుంచి మూడు గ్రాముల పచ్చ కర్పూరం వేసి, దాని పైన కొద్దిగా పసుపు జల్లి, దేవుడి ముందు ఉంచాలి. అలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మిదేవి ప్రభావం ఉంటుందని నమ్మకం. వైద్య పరిభాషలో చూస్తే.. ఇది ఒక వైద్య ప్రక్రియ. ప్రతి రోజు దేవుడి ముందు అలా పచ్చ కర్పూరం ఉంచడం వల్ల ఇంట్లో గాలి పవిత్రమవుతుంది. వానాకాలం, చలికాలం గాలి తేమలో హానికారక సూక్ష్మజీవులు ఉంటాయి. పచ్చ కర్పూరం ఆవిరి అయ్యే గాలిలో కలిసి గాలిని శుభ్రం చేస్తాయి. ఆ గాలిని పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు శక్తివంతమై, ఇంటిల్లిపాదికి ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి పొందుతాయి. ఆరోగ్యం ఉన్న ఇంట్లో.. సంపద చేకూరడం సహజమే కనుక.. మన పెద్దలు ఇలాంటి ఆచారాలను అలవాటు చేశారు.
ఇక శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు ఉన్నవాళ్లు బెడ్రూమ్ లో కూడా ఇలా పచ్చకర్పూరాన్ని ఉంచాలి. ఒక మిరియం గింజ సైజు పచ్చ కర్పూరాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తే.. నోటి నుంచి వచ్చే వాసన పారిపోతుంది. సిగరెట్స్, ఆల్కాహాల్ అలవాటు ఉన్నవాళ్లు ఇలా చేస్తే ఆ అలవాట్లు మానే సామర్థ్యం వస్తుంది. జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తే జ్వరం కూడా తగ్గుతుంది. అలాగే లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి, కండరాల్లో, నరాల్లో ఉత్తేజం కలుగుతాయి. అందుకే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో పచ్చకర్పూరం కలుపుతారు.