బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) తన లేటెస్ట్ మూవీ ‘ఐ వాంట్ టు టాక్(I Want To Talk)’తో ప్రేక్షకుల ముందు వచ్చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి-16 సీజన్‌లో అభిషేక్, మూవీ డైరెక్టర్ సుజిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ సినిమాలో అర్జున్ అనే పాత్ర జీవితం, అతడి జీవిత ఆశయనం తనను కదిలించాయని, అందుకే పూర్తి కథ వినకుండానే ఓకే చెప్పానని అభిషేక్ అన్నాడు. ‘నాకు సుజిత్(Shoojit Sircar) పూర్తి కథ చెప్పలేదు. తండ్రి పాత్ర జీవితం, ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారు. అది నాకు నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను’ అని అభిషేక్ తెలిపాడు.
‘‘ఈ సినిమా కథలో తండ్రి పాత్ర కేవలం వంద రోజులు మాత్రమే బతుకుతాడు. ఆ విషయం తెలిసిన అతని కూతురు ఏంటి చచ్చిపోతావా? నా పెళ్ళిలో డ్యాన్స్ చేయవా? అని అమాయకంగా అడుగుంది. దాంతో తన బాధను దిగమింగుకుంటూ తప్పకుండా నీ పెళ్ళిలో డ్యాన్స్ చేస్తానని మాటిస్తాడు. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యంగా మారుతుంది. మరి తన లక్ష్యాన్ని ఆ తండ్రి చేరుకున్నాడా అనేదే ‘ఐ వాంట్ టు టాక్’ కథ’’ అని వివరించారు.
‘‘ఈ కథ నా హృదయాన్ని కదిలించింది. కూతురు భావోద్వేగాన్ని తండ్రి మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆరాధ్య నా కుమార్తె, సుజిత్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మేమంతా గర్ల్ డాడ్స్. అందుకే ఈ సినిమాలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నాం. తన కూతురుకు ఇచ్చిన మాట కోసం అర్జున్ చేసే పోరాటం చాలా గొప్పది. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేం’’ అని అభిషేక్(Abhishek Bachchan) వివరించాడు. మరి అర్జున్ చేసిన పోరాటం గురించి తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.