రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేయించిన కేసులో కన్నడ నటుడు దర్శన్(Actor Darshan) జైలుకెళ్లాడు. ఖైదీగా ఉన్న దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు అందుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతలోనే ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో జైలు నుంచే దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఉంది. ఈ వీడియోలో అవతలి వ్యక్తి కూడా వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. ఇందులో దర్శన్, అతడి స్నేహితుడు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. ఒక వ్యక్తిని హత్య చేయించిన ఖైదీకి కేవలం నటుడు అన్న కారణంగా రాచమర్యాదలు చేయడం ఏమాత్రం సమంజసం అని అంతా ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
దర్శన్(Actor Darshan) ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఈ సమయంలోనే అతడు జైలు బ్యారక్ నుంచి వచ్చి స్నేహితులతో కూర్చుని దర్జాగా కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోను రైడీషీటర్ వేలు అనే వ్యక్తి సీక్రెట్‌గా తీసి తన భార్యతో షేర్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఫొటో, వీడియో వైరల్ కావడం నగర పోలీసులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక విచారణ ఖైదీకి ఎలా రాచమర్యాదలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోపై విచారణ చేపట్టాలని డీజీ మాలిని ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర నిందితులను ఈ అంశంపై విచారించాలని, అనంతరం తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.