Govinda – Avatar | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ‘అవతార్’. కనివినీ ఎరుగని రీతిలో ఈ సినిమా రికార్డ్‌లు సృష్టించింది. సినీ ప్రేమికులను మరో ప్రపంచానికి తీసుకెళ్లింది. ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా నిలిచింది. ప్రతి దేశంలో కూడా ఈ సినిమా రికార్డ్‌లు సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా ఔరా అనిపించింది. కలెక్షన్ల పంట పండించింది. ఇలాంటి సినిమాలో అవకాశం వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఓకే చెప్తారు. ఎలాంటి పాత్రయినా చేస్తామంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతామంటారు. కానీ ఈ సినిమాలో వచ్చిన అవకాశాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద మాత్రం నో చెప్పాడట. అందుకు ఈ సినిమాలో నటించాలంటే శరీరానికి రంగు వేసుకోవాలని చోప్పడమే కారణమని తాజాగా అతడు వెల్లడించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోవింద తనకు వచ్చిన ‘అవతార్’ అవకాశం గురించి వెల్లడించాడు.
‘‘అమెరికాలో ఓ సర్దార్‌కు బిజినెస్ ఐడియా ఇచ్చా. అది గ్రాండ్ సక్సెస్ అయింది. దాంతో అతడు నన్ను ఒకసారి అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) దగ్గరకు తీసుకెళ్లాడు. జేమ్స్‌తో కలిసి డిన్నర్ కూడా చేశా. అప్పుడే ఆయన నాకు ‘అవతార్(Avatar)’ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఓ కీలకమైన స్పైడర్ పాత్రలో నటించాలని, అందుకు రూ.18 కోట్ల పారితోషికం ఇస్తామని, షూటింగ్ 410 రోజులు ఉంటుందని చెప్పారు. ఓకే అన్నాను. కానీ ఆ పాత్ర కోసం శరీరానికి రంగు వేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంతే ఆ ఆఫర్‌కు నో చెప్పేశా. నాకు రూ.18కోట్లు వద్దు. శరీరానికి పెయింట్ వేసుకుంటే నేను ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. అందుకే నో చెప్పా. ఆ తర్వాత ఆ పాత్రలో నటించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా. అతడి నటన వేరే లెవెల్‌లో ఉంది’’ అని అన్నాడు గోవింద(Govinda).