యాంకర్, నటి గాయత్రి భార్గవి(Gayatri Bhargavi) తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ థంబ్ నెయిల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ చానల్ లో తన భర్త గురించి తప్పుదారి పట్టించే, పరువు నష్టం కలిగించే తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. జర్నలిస్ట్ స్వప్న హోస్ట్ చేసిన iDream మీడియాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చానని గాయత్రి చెప్పారు. ఇంటర్వ్యూలో, తన భర్త ఆర్మీ అధికారిగా విధుల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి ఒక సెన్సిటివ్ విషయాన్ని షేర్ చేసుకున్నానని తెలిపారు.
అయితే, మీడియా ఛానెల్ చాలా తప్పుదోవ పట్టించే థంబ్‌నెయిల్ తో వీడియో పోస్ట్ చేశారని చెప్పారు. ”ఆయన మంచులో కూరుకుపోయి, అక్కడే చనిపోయారు! శరీరాన్ని ముక్కలు చేసి చిన్న డబ్బాలో ఇంటికి పంపించారు. రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదు” అనే థంబ్‌నెయిల్ తో ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేసింది సదరు యూట్యూబ్ చానల్. “ఇది నా భర్తకి ఏదో అయిందని నేను చెప్పినట్టు ఉంది. మా భర్త ఇక్కడే ఉన్నారు. ఇలా థంబ్‌నెయిల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్?” అని సదరు చానల్ ని, జర్నలిస్టు స్వప్నను ఆమె(Gayatri Bhargavi) నిలదీశారు. వీడియోని ఆమె తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఇలాంటి థంబ్‌నెయిల్‌స్ ని వ్యతిరేకించేవారు ఓట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు.