Allu Aravind – NTR | జూనియర్ ఎన్‌టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేశాడు. అతడు నటించనున్న రెండో సినిమా ‘ఆయ్’. ఈ సినిమా థీమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా గురించి ఎన్‌టీఆర్(NTR)కు ఫోన్ చేసిన అతని సమాధానం విని ఆశ్చర్యపోయానన్నారు.
‘‘ఆయ్ సినిమాకు హీరోగా నితిన్‌ను ఎంపిక చేయాలని అనుకుంటున్నామని, దానిపై మీ అభిప్రాయం ఏంటని ఎన్‌టీఆర్‌ను ఫోన్‌లో అడిగాను. అప్పుడు ఎన్‌టీఆర్ ఏమన్నాడంటే.. ‘మనవాళ్లు అనేది మొదటి సినిమా వరకే ఉంటుంది. ఆ తర్వాత ఎవరి కష్టం వారిదే. చేసే శ్రమను బట్టి ఎదుగుతారు. మీరు నిర్మించబోయే సినిమా కథ బాగుందని నితిన్ నాకు చెప్పాడు. అందుకే మిగిలిన విషయాలు పట్టించుకోవద్దు. కథ బాగుంటే సినిమా తప్పకుండా మెప్పిస్తుంది’ అని ఎన్‌టీఆర్ బదిలిచ్చారు. దాంతో చాలా నమ్మకంగా ఈ సినిమా విషయంలో ముందడుగు వేశాను. నితిన్(Narne Nithin) చాలా ప్రతిభావంతుడు. అద్భుతమైన నటన కనబరిచాడు. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది’’ అని అల్లు అరవింద్(Allu Aravind) చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆయ్ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.