సంధ్య థియేటర్ ఘటన రోజురోజుకు తీవ్ర వివాదంగా మారుతోంది. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్(Revanth Reddy) కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, తన వద్దకు పోలీసులు ఎవరూ వచ్చి విషయం చెప్పలేదని అల్లు అర్జున్(Allu Arjun) క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై తీవ్రమైన నెగిటివిటీ పెరిగింది. కొందరు భారీ పరుష పదజాలం వాడుతూ అల్లు అర్జున్‌పై నెగిటివ్ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఒక మహిళ చావుకు కారణమయ్యాడన్న బాధ కూడా సదరు హీరో కళ్లలో కనిపించడం లేదని, అతను మనిషి కాదు పశువు అంటూ మరికొందరు ఇలా తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్‌పై ఆగ్రహంతో కూడి పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా వీటిపై బన్నీ స్పందించారు. ఒకరిని కించపరిచేలా పోస్ట్‌లు పెట్టడం తగిన పద్దతి కాదని వివరించారు.
‘‘అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. కానీ ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం సరైన పద్దతి కాదు. ఈ మధ్య కొందరు ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలు, ప్రొఫైళ్లతో తీవ్ర అభ్యంతరకర పోస్ట్‌లు పెడుతున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా అభిమానులంతా కూడా ఇలా నెగిటివ్ పోస్ట్‌లు పెట్టే వారికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లో కూడా బాధ్యతగా ఉండాలి’’ అంటూ అల్లు అర్జున్(Allu Arjun) సోషల్ మీడియాలో ఒక లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది.