టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరబాద్ రాయదుర్గం హైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లోని ఆయన నివాసం నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులకు సంబంధించే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆయనపై పలు కేసులు నమోదై ఉన్న నేపథ్యంలో ఏ కేసులో అరెస్ట్ చేశారు అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
రాయదుర్గం పోలీసులకు పోసాని అరెస్ట్‌కు సంబంధించిన సమాచారం అందించిన తర్వాత ఆయనను రాయచోటికి(Rayachoty) తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఆయనను కోర్టు ముందు హాజరు పరిచి విచారణ నిమిత్తం రిమాండ్ విధించాలని పోలీసులు కోరే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
అరెస్ట్ చేసే సమయంలో పోసాని కృష్ణమురళికి(Posani Krishna Murali) పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు నటుడు పోసాని. కేసు ఉన్న సమయంలో ఎక్కడికి వచ్చి అయినా అరెస్ట్ చేసే అధికారం తమకుందంటూ సదరు అధికారి సమాధానం ఇచ్చారు. ఈ మేరకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.