నెల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ వయోలిస్ట్, మలయాళ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కన్నుమూశారు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో మాలీవుడ్ విషాదంలో మునిగింది. మంచి సంగీత దర్శకుడిగా పేరున్న బాలభాస్కర్ మరణం తమను బాధించిందని మాలీవుడ్ నటీనటుడు తమ సంతాపాన్ని ప్రకటించారు.
అయితే గత మంగళవారం త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. తిరువనంతపురం శివారు ప్రాంతంలో బాలభాస్కర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో బాలభాస్కర్ ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె తేజస్వి బాల అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడ్డ బాలభాస్కర్ చికిత్స తీసుకుంటూ ఇవాళ కన్నుమూశారు. మరోవైపు ఆయన భార్య లక్ష్మికి కూడా గాయలవ్వగా.. ఆమె కోలుకున్నట్లు సమాచారం. కాగా సంగీత కుటుంబంలో పుట్టిన బాలభాస్కర్ చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలో కొన్ని మలయాళ చిత్రాలకు సంగీతం అందించాడు. అలాగే వయోలిన్‌ను వాయించడంలో ప్రముఖుడిగా పేరొందిన బాలభాస్కర్ ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు.