కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి టాలీవుడ్ కథానాయకుడు బాలకృష్ణ నివాళులర్పించారు. అక్కడే కన్నీరుపెట్టుకున్నారు. ఆ తర్వాత పునీత్ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. అతడి సోదరుడు శివరాజ్‌కుమార్‌ను కూడా ఓదార్చారు.
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్..గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ఉంచారు. పునీత్చివరి చూపు కోసం సినీ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు.
తన ప్రాణమిత్రుడు పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తతో తారక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన స్నేహితుడిని చివరిసారిగా చూసుకునేందుకు ఎన్టీఆర్ శనివారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యుల్ని పరామర్శించనున్నారని సమాచారం. మరోవైపు, నందమూరి కుటుంబసభ్యులు, అందులోనూ తారక్‌తో పునీత్‌కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్ ‘గెలయా గెలయా’ అనే పాట ఆలపించారు.