Bharat Ratna Award to NTR Soon: నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఘడియలు రాబోతున్నాయా? వారి చిరకాల కోరిక త్వరలో నెరవేరనుందా? తెలుగువారి అభిమాన నటుడు, నాయకుడు అన్న నందమూరి తారకరామారావు కి భారతరత్న అవార్డు దక్కనుందా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ అవార్డును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తమకు కలిసి వచ్చే ఏ అంశాన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. కొద్దిరోజుల క్రితం అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అప్పటి నుండి జూనియర్ అభిమానుల్లో బీజేపీపై సానుకూల దృక్పథం కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు ఇస్తే బిజెపికి మరింత మైలేజ్ దక్కుతుందనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో ఎన్టీఆర్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.