టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణల కేసు దేశమంతా సంచలనంగా మారింది. దానిని మరువక ముందే మరో ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అతడెవరో కాదు బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్‌లో ఒకడైన రెమో డిసౌజా(Remo Dsouza). అతడి భార్యపై కూడా ఈ చీటింగ్ కేసు నమోదైంది. రెమో, అతడి భార్యతో పాటు మరో ఐదుగురు కలిసి తనను మోసం చేశారంటూ ఓ 26 ఏళ్ళ డాన్సర్ పోలీసులను ఆశ్రయించాడు. ముంబైలోని మిరారడ్ పోలీస్ స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఈ విషయం బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
2018-24 మధ్యలో ఈ డాన్సర్ టీమ్ ఓ డాన్స్ షోలో విజయం సాధించింది. ప్రైజ్‌మనీగా రూ.11.96కోట్లు వచ్చాయి. కానీ ఆ డబ్బు మొత్తం కూడా తమదే అన్నట్లు రెమో, అతడి భార్య బిల్డప్ ఇచ్చి లాగేసుకున్నారు. ఇందులో రెమో(Remo Dsouza), అతడి భార్య లీజెల్(Lizelle DSouza)తో పాటు ఓం ప్రకాశ్ శంకర్, రోహిత్ జాదవన్, ఫ్రేమ్ పరొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేష్ గుప్తా కూడా ఉన్నారని సదరు వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్స్ 465(ఫోర్జరీ), 420(మోసం) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.