మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సత్కారం గురించి జరుగుతున్న తప్పుడు వార్తల వ్యాప్తిని ఖండిస్తూ, UK పార్లమెంట్ నుంచి క్లారిటీ వచ్చింది. అయితే, చిరంజీవిని UK పార్లమెంట్‌లో సత్కరించారనే విషయంలో ఎటువంటి వివాదం లేదు. కానీ, ఆ అవార్డును లండన్ పార్లమెంట్ స్వయంగా ప్రదానం చేయలేదు. లండన్‌కు చెందిన NGO బ్రిడ్జ్ ఇండియా నుండి ప్రదానం చేయబడింది.
కళారంగం ద్వారా ప్రజా సేవలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకులు ప్రతీక్ దత్తాని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని UK పార్లమెంట్‌లోని అద్దె గదిలో నిర్వహించారు. తప్పుడు ప్రచారంపై స్పందిస్తూ UK పార్లమెంట్ లోని మీడియా రిలేషన్‌షిప్ మేనేజర్ సిలాస్ స్కాట్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ అవార్డు లండన్ పార్లమెంట్ అధికారిక గుర్తింపు కాదని, లండన్‌కు(London) చెందిన NGO ఇచ్చిన గౌరవమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Xలో “UK పార్లమెంట్ ఇచ్చిన అవార్డు తన సోదరుడి కీర్తిని పెంచింది” అని పేర్కొన్న పోస్ట్‌కు ప్రతిస్పందనగా సిలాస్ స్కాట్ నుంచి ఈ స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా, లండన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో బ్రిడ్జ్ ఇండియా బృందం(Bridge India Team) ప్రదానం చేసిన అవార్డుకు చిరంజీవి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 19న UK పార్లమెంట్ సభ్యులు, దౌత్యవేత్తల సమక్షంలో ఈ అవార్డును చిరంజీవికి అందజేశారు.