అనారోగ్యంతో కైకాల..ఇంటికి వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసిన మెగాస్టార్

0
97

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ జన్మదినం నేడు. 60 సంవత్సరాలు పైగా తెలుగు సినిమా రంగంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు సత్యనారాయణ. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు.

తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1935లో కృష్ణ జిల్లా బంటుమిల్లి గ్రామంలో జూలై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఎన్నో నాటకాల్లో నటించారు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా వున్న సత్యనారాయణ గతేడాది క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో దక్షిణాది టాకీ సింహం హనుమంతప్ప మునియప్ప రెడ్డి పాత్రలో నటించారు.

కైకాల సత్యనారాయణ బర్త్ డే సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ పుట్టినరోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నానని చిరు ట్వీట్ చేశారు. ఫొటోలో కైకాలను చూస్తే అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది.