మాలీవుడ్ హేమ కమిటీ(Hema Committee) ప్రస్తుతం దేశమంతా సంచలనంగా మారింది. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై దర్యాప్తు కోసం వేసిన ఈ కమిటీ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాజాగా కాస్టింగ్ కౌచ్ అంశంపై కోలీవుడ్(Kollywood) హీరో, కోలీవుడ్ సినిమా అసోసియేషన్ ‘నడిగర్ సంఘం(Nadigar Sangam)’ జనరల్ సెక్రటరీ విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. అయినా సరే తమిళనాడు సినీ పరిశ్రమలో కూడా మహిళ భద్రతపై దృష్టి పెడతామని, అతి త్వరలోనే కోలీవుడ్‌లో కూడా 10 మందితో హేమ కమిటీ తరహా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీని తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని, నటీమణులు తమకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా కమిటీకి ఫిర్యాదు చేయొచ్చని విశాల్ వెల్లడించారు.
విచారణ పూర్తయిన తర్వాత కమిటీ నివేదికను బట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాల్(Vishal) చెప్పాడు. అనంతరం హేమ కమిటీ రిపోర్ట్ స్పందించి.. అందులో అంశాలు తెలిసి తాను షాకయ్యానని అన్నాడు. ‘‘ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరం. సినిమా అవకాశం ఇస్తామని ఆశ చూపి మహిళలతో తప్పుగా ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పాలి. నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్(Kollywood)లో కూడా కొందరు మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై దృష్టి సారిస్తున్నాం. అతి త్వరలోనే కోలీవుడ్‌లో కూడా ఓ కమిటీ ఏర్పాటు చేస్తాం’’ అని ప్రకటించారు.