ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు గట్టి షాక్ తగిలింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. గతంలో రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఓ థియేటర్‌ను నడిపించారు. థియేటర్ నష్టాల్లో కూరుకుపోవడంతో దానిని మూసివేశారు. అయితే థియేటర్‌లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై కార్మికులతో పాటు లేబర్ కార్పొరేషన్ అధికారులు ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత జయప్రదతో పాటు ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానా విధించిస్తూ తుది తీర్పు ఇచ్చింది. కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని జయప్రద తరపు న్యాయవాదులు చెబుతున్నారు.
ఎనభై, తొంభై దశకాల్లో జయప్రద స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు అగ్రతారగా జనం నీరాజనాలు అందుకున్నారు. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జయప్రద… ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే కామెడీ షోలో జడ్జ్ గా పాల్గొంటున్నారు.