Review: నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీ రివ్యూ

0
101

అక్కినేని యువ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’. ఫీల్ గుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. చై సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల తర్వాత చై నటించిన చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? చై నటన, విక్రమ్ టేకింగ్, రాశి మ్యాజిక్ సినిమాను నిలబెట్టాయా లేదా ఇప్పుడు తెలుసుకుందాం..

నారాయ‌ణ‌పురం గ్రామం నుంచి అభిరామ్ (నాగచైతన్య) అమెరికాకు ఉద్యోగం కోసం వ‌స్తాడు. రావ్ క‌న్స‌ల్‌టెన్సీ య‌జ‌మాని రావ్‌(ప్ర‌కాష్ రాజ్‌) అత‌నికి ఇంట‌ర్వ్యూల‌ను ఏర్పాటు చేస్తుంటాడు. అయితే అభిరామ్‌కి ఉద్యోగం చేయ‌టంపై పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు. త‌ను వైద్య అనే మెడిక‌ల్ యాప్‌ను క‌నిపెడ‌తాడు. దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లాల‌ని అనుకుంటాడు. అయితే రావ్ అలాంటివ‌న్నీ వ‌ద్ద‌ని, ఉద్యోగం చేసుకుని సెటిల్ కావాల‌ని త‌ను చెబుతుంటాడు. అయితే రావ్ త‌నకు స‌పోర్ట్ చేయ‌లేద‌నే బాధ అభిరామ్‌లో ఉండిపోతుంది. అదే క‌న్స‌ల్‌టెన్సీలో ప‌నిచేసే ప్రియ (రాశీ ఖ‌న్నా)కి అభిరామ్‌లోని ఉత్సాహం నచ్చుతుంది. అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. ఇద్ద‌రూ లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో ఉంటారు. అభిపై ఉన్న ల‌వ్‌తో ప్రియ‌.. త‌న యాప్‌కి కావాల్సిన పెట్టుబ‌డిని స‌ర్దుబాటు చేస్తుంది. యాప్ డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీల‌కు న‌చ్చ‌టంతో వాళ్లు ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అక్క‌డ నుంచి అభిరామ్ లైఫ్ మారిపోతుంది. త‌న‌కు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చిన ఉద్యోగుల‌ను స‌రిగా ప‌ట్టించుకోడు. అడిగిన వారిని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అభిరామ్ ప్ర‌వ‌ర్త‌న ప్రియ‌కు న‌చ్చదు.

దీనితో ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్‌ అవుతాడు. తన మనస్సాక్షితో తాను మాట్లాడుకోవడం మొదలుపెడతాడు. కెరీర్‌ గ్రోత్‌ అంటూ తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని వదిలేశానని.. అందుకే అందరూ తనకు దూరమయ్యారని తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకొని.. ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటాడు. స్కూల్‌, కాలేజీ డేస్‌ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్‌), చిన్నూ(అవికా గోర్‌), శర్వా(సుశాంత్‌ రెడ్డి) కలిసి థ్యాంక్స్‌ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్‌కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ.

జీవితంలో ఎవరైనా ఇతరుల సపోర్ట్‌ లేకుండా సొంతంగా ఎదుగరు. పేరెంట్స్‌..బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరో ఒకరు మన ఎదుగుదలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తుంటారు. మనం ఓ స్థాయికి చేరాక..అలాంటి వారిని మరచిపోవద్దు’అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌. డైరక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటీకీ..తెరపై మాత్రం అది అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. మహేశ్‌బాబు ఫ్లెక్సీ సీన్‌ ఆకట్టుకుంటుంది.

అభిరామ్ పాత్ర‌లో నాగ చైత‌న్య ఒదిగిపోయాడు. ఆయన పాత్రకి చాలా వేరియషన్స్‌ ఉంటాయి. అన్నింటిని చక్కగా డీల్‌ చేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఒదిగిపోయాడు. కథనంత తన భూజాన వేసుకొని నడిపించాడు.  ఇక ప్రియగా రాశీఖన్నా పర్వాలేదనిపించింది. అయితే ఇందులో ఆమె పాత్రకు నిడివి తక్కువ. ఇక అభి స్కూల్‌డేస్‌ లవర్‌ పార్వతి పాత్రలో మాళవికా నాయర్‌ మంచి నటనను కనబరిచింది. చైతూ- మాళవికా నాయర్‌లా కెమిస్ట్రీ తెరపై వర్కౌట్‌ అయింది. చిన్నూగా అవికా ఘోర్‌ తన పాత్ర పరిధిమేర నటించింది.  ప్రకాశ్‌రాజ్‌  సాయి సుశాంత్‌ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఇక సాంకేతిక విషయానికొస్తే.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ అందంగా కనిపిస్తుంది.  తమన్‌ సంగీతం జస్ట్‌ ఓకే. టైటిల్‌ సాంగ్‌, కాలేజ్‌ వీడ్కోలు పార్టీ సందర్భంగా వచ్చే పాటలు కొంతమేర ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

నాగచైతన్య నటన

ఎమోషన్స్

నేప‌థ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

కథలో కొత్తదనం లేకపోవడం

థమన్ సంగీతం అంతంత మాత్రమే

సెకండ్ హాఫ్

రేటింగ్: 2.75/5

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించి. వ్యక్తిగత అభిప్రాయం కాదు.