సిల్క్ స్మిత. ఈ పేరు తెలియని వారుండరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆమె దశాబ్ధంన్నర పాటు ఇండస్ట్రీని ఏలారు. అయితే 1996, సెప్టెంబర్ 23వ తేదీన చెన్నైలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని తనువుచాలించారామె. ఆమె ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇప్పటికే మిస్టరీగా ఉండటంతో రకరకాలు ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఆమె గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. 1960 డిసెంబర్2న ఏలూరులో జన్మించిన ఆమె 4వ తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్లకే పెళ్లి కూడా చేసేశారు. అయితే భర్త, అత్తమామలు వేధింపులతో ఇల్లు వదిలి పారిపోయింది. నటనపై ఉన్న ఇష్టంతో మద్రాసుకి వెళ్లి తొలుత టచప్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. తొలి సినిమా బండి చక్రంలో తాను పోషించిన సిల్క్ పాత్రనే తన ఇంటి పేరుగా మార్చుకుంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో సిల్క్ డ్యాన్స్ బీట్ లేనిదే స్టార్ హీరోల సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతలా క్రేజ్ సంపాదిచుకున్న ఆమె స్టార్ హీరోలకు సరిసమానంగా పారితోషికం తీసుకునేది. ఎన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం ”సాంగ్‌లో నర్తించిన సిల్క్..ఆ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ స్టెప్పులు ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ సమయంలోనే ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’ వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సిల్క్‌స్మిత చనిపోయి డిసెంబర్ 2 నాటికి 25 ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా సిల్క్ స్మిత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని జనం మదిలో నిలిచిపోయారు.