Review: ‘దృశ్యం2’ మూవీ రివ్యూ..

0
101

దృశ్యం సినిమాకు సీక్వెల్​గా వచ్చిన ‘దృశ్యం2’ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్​లకు మంచి స్పందన వచ్చింది. నిన్న అర్థరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సారీ కూడా ఈ సినిమా ప్రేక్షకుడిని ఉత్కంఠకు లోను చేసిందా? దృశ్యంను మించి దృశ్యం2 ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

సినిమా ఏంటంటే..

వరుణ్‌ కనిపించకుండా పోయిన కేసు నుంచి బయటపడిన రాంబాబు (వెంకటేశ్‌) కుటుంబం ఉన్నత జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ స్థాయి నుంచి థియేటర్‌ ఓనర్‌గా, ఓ సినిమాను నిర్మించే స్థాయికి ఎదుగుతాడు. అయితే వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు, అను (కృతిక, ఏస్తర్‌ అనిల్‌) భయంతో వణికిపోతుంటారు.

వరుణ్‌ను రాంబాబు హత్య చేసి ఉంటాడని ఊళ్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. పోలీసులకు అదే అనుమానం ఉన్నా, ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వల్ల ఆ కేసును సీక్రెట్‌గా విచారిస్తుంటారు. అదే సమయంలో ఐజీ గౌతమ్‌ సాహూ(సంపత్‌ రాజ్‌) ఆ కేసును రీఓపెన్‌ చేస్తాడు. మరి వరుణ్ కేసు విషయంలో ఐజీకి దొరికిన ఆధారాలేంటి? అప్పుడు రాంబాబు ఏం చేశాడు? కేసు రీఓపెన్‌తో రాంబాబు భార్య, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఈ కేసు నుంచి బయటపడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నటనతో కట్టిపడేసిన వెంకటేష్

రీమేక్‌ కథలను రక్తికట్టించడంలో విక్టరీ వెంకటేష్ ది అందెవేసిన చేయి. ‘దృశ్యం’లో ఇద్దరు బిడ్డల తండ్రిగా కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఎలాగైతే రాంబాబు పాత్రలో ఒదిగిపోయారో.. ‘దృశ్యం2’లో అదే స్థాయి నటన కనబరిచారు. ‘నారప్ప’, ‘దృశ్యం2’ చిత్రాలు వెంకటేశ్‌ను నటుడిగా మరోస్థాయిలో నిలబెట్టాయి. రాంబాబు భార్య పాత్రలో మీనా, కుమార్తెలుగా కృతిక, ఏస్తర్‌లు తమ పరిధి మేరకు నటించారు. మొదటి భాగంలో లేని కొన్ని పాత్రలు ఇందులో వచ్చాయి. ముఖ్యంగా ఐజీగా సంపత్‌రాజ్‌, కానిస్టేబుల్‌గా సత్యం రాజేశ్‌, రచయితగా తనికెళ్ల భరణి, లాయర్‌గా పూర్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అనూప్‌ రూబెన్స్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌. దర్శకుడు జీతూ జోసెఫ్‌మలయాళంలో ‘దృశ్యం2’ ను సవాల్‌గా తీసుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

బలాలు: వెంకటేష్ నటన, కథ, కథనం, సంగీతం, దర్శకత్వం, క్లైమాక్స్‌

బలహీనతలు: కొన్ని సన్నివేశాలు.

రేటింగ్: 3/5

దృశ్యంను మించిన “దృశ్యం 2”