హీరోయిన్ తమన్నా భాటియా(Tamanna)ను హవాలా కేసులో ఈడీ విచారించింది. నగదును అక్రమ చలామణి కోసం పాటించే ఒక ప్రక్రియ హవాలా. ఈ కేసుకు సంబంధించి తమన్నాను అధికారులు విచారించడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తమన్నాను హవాలా కేసులో విచారించడం ఏంటి? తమన్నాకు హవాలా కేసుకు సంబంధం ఏంటి? తమన్నా హవాలా చేసిందా? చేయించిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కాగా ఓ యాప్ ప్రమోట్ చేయడం వల్లే తమన్నా చిక్కుల్లో పడినట్లు స్పష్టం అవుతోంది. కాగా ఈ కేసుకు సంబంధించి తమన్నాపై ఎటువంటి నేరారోపణ అభియోగాలు మోపబడలేదని ఈడీ అధికారులు చెప్తున్నారు.
క్రిప్టో కరెన్సీ(Cryptocurrency), బిట్కాయిన్ల మైనింగ్ పేరిట పలువురిని మోసగించిన కేసులో ‘హెచ్‌పీజ్‌డ్ టోకెన్’ అనే మొబైల్ యాప్ పాత్రను అధికారులు కనుగొన్నారు. ఈ కేసులో వెల్లడైన మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించే తమన్నా(Tamanna) వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఈ యాప్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి తమన్నా కొంత నగదు తీసుకున్నారని తెలియడంతో ఆమెను ఈడీ విచారించినట్లు సమాచారం.