టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ కి మహేష్ బాబు యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీలకు ఆయన చేసిన యాడ్స్ కి రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో డబ్బు తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఆయన తీసుకున్న మొత్తంలో రూ. 3.5 కోట్లు నగదు, రూ.2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ కి మహేష్ బాబు(Mahesh Babu) చేసిన ప్రకటనలను చూసి.. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి అని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించారన్న అభియోగాలపై మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈడీ సోదాల్లో లభించిన ఆధారాలు…
హైదరాబాద్ లో సూరానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని రెండు నెలల క్రితం ఈడీ కేసు నమోదైంది. మనీలాండరింగ్‌తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ నెల 16న చెన్నై కి చెందిన ఈడీ బృందం సురానా గ్రూప్ చైర్మన్ నరేందర్, డైరెక్టర్ దేవేందర్ ఇళ్లల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సురానా గ్రూప్ తో అనుసంధానంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ పైనా కూడా దాడులు చేసింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్లో తనిఖీలు జరిపింది. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించింది.